న్యూయార్క్: విద్యుత్తు నిల్వలో ఉన్న సవాళ్లను అధిగమించేందుకు ఆకాశహర్మ్యాల లాంటి బ్యాటరీలు నిర్మించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇవి ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణాలుగా మారనున్నాయి. ఇందుకోసం బుర్జ్ ఖలీఫా, వన్ వరల్డ్ ట్రేడ్ వంటి నిర్మాణాలను డిజైన్ చేసిన స్కిడ్మోర్, ఓవింగ్స్ ఆండ్ మెర్రిల్(ఎస్ఓఎం), విద్యుత్తు నిల్వ సంస్థ అయిన ఎనర్జీ వాల్ట్ అనే సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
ఈ రెండు సంస్థలు కలిసి భారీ బ్యాటరీ బ్లాకులతో కూడిన ఆకాశహర్మ్యాలను నిర్మించనున్నాయి. వీటి ఎత్తు 985 అడుగుల నుంచి 3,300 అడుగుల వరకు ఉండనుంది. వీటిల్లో పునరుత్పాదక విద్యుత్తును నిల్వ చేస్తారు. విద్యుత్తు డిమాండ్ పెరిగినప్పుడు ఈ బ్యాటరీల నుంచి సరఫరా చేస్తారు.
డిమాండ్ తగ్గినప్పుడు ఉత్పత్తయ్యే విద్యుత్తును వీటిల్లో నిల్వ చేస్తారు. ఎనర్జీ వాల్ట్ సంస్థ ఇప్పటికే చైనాలో 492 అడుగుల ఎత్తైన విద్యుత్తు నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ప్రపంచంలో ఎత్తైన భవనంగా బుర్జ్ ఖలీఫా(2,717 అడుగులు) ఉంది.