వాషింగ్టన్ : వలసల నియంత్రణ కోసం ట్రంప్ సర్కారు మరో నిర్ణయం తీసుకుంది. వీసా ఓవర్ స్టే(గడువుకు మించి నివసించడం), పాస్‌పోర్ట్ మోసాలను అరికట్టేందుకు వీలుగా సరిహద్దులు, విమానాశ్రయాల్లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని విస్తరించాలని అమెరికా నిర్ణయించింది. గ్రీన్‌కార్డుదారులతో పాటు వలసదారులందరికీ ఈ కొత్త నిబంధన వర్తించనుంది. డిసెంబర్ 26 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, భౌగోళిక సరిహద్దు ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో అమెరికన్ పౌరులు కాని వారిని ఫొటో తీసే అధికారం అమెరికా బోర్డర్ అథారిటీకి లభించింది. వేలిముద్రలు లేదా డీఎన్ఏ వంటి ఇతర బయోమెట్రిక్స్‌ను సమర్పించాలని కూడా అధికారులు కోరవచ్చు. అదే విధంగా 14 ఏళ్ల లోపు బాలలు, 79 ఏళ్లు పైబడిన వయసు గలవారి ఫేషియల్ రికగ్నిషన్‌ను కూడా ఉపయోగించవచ్చు. ఈ టెక్నాలజీ వాడటం వల్ల వ్యక్తిగత గోపత్య(ప్రైవసీ)కి భంగం కలుగుతుందని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.