వాషింగ్టన్ : వెయ్యేండ్లలో చూడని వరద ముప్పు అమెరికాను వణికిస్తున్నది. ఓజర్క్స్, మిసిసిపీ లోయ, ఓహియో లోయలోని అత్యధిక ప్రాంతంలో రానున్న ఐదు రోజుల్లో నాలుగు నెలల వర్షపాతానికి సమానమైన వర్షం కురుస్తుందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. టెక్సాస్ నుంచి మిషిగన్ వరకు ప్రమాదకర ప్రాంతమని, ఇక్కడ పెను తుఫానులు రావచ్చునని వెల్లడించింది. ఆర్కాన్సాస్, టెన్నెసీ, ఇల్లినాయిస్, ఇండియానా, మిసోరీ, కెంటకీ, మిసిసిపిలకు ప్రమాదకర తుఫాను హెచ్చరికలను జారీ చేశారు. కెంటకీ, ఆర్కాన్సాస్ గవర్నర్లు బుధవారం ఎమర్జెన్సీని ప్రకటించారు. ఆక్యువెదర్ చీఫ్ మెటీరియాలజిస్ట్ జోనాథన్ పోర్టర్ మాట్లాడుతూ, నదులు ఉప్పొంగి, వరదలు సంభవించే అవకాశం ఉందని, క్షణాల్లోనే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడవచ్చునని హెచ్చరించారు. కెంటకీ, టెన్నెసీ, మిసోరీ, ఆర్కాన్సాస్లలోని చాలా ప్రాంతాల్లో ఈ వారాంతానికి ఒకటి నుంచి రెండు అడుగుల వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు.