Suicide Capsule | జురిచ్, జూలై 18: ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు నొప్పి లేకుండా తనువు చాలించేలా చేసే సూసైడ్ క్యాప్సూల్ మరికొన్ని నెలల్లో స్విట్జర్లాండ్లో అందుబాటులోకి రానున్నది. సార్కో క్యాప్సూల్గా పిలిచే ఈ సూసైడ్ మెషీన్ను లాస్ట్ రిసార్ట్ ఆర్గనైజేషన్ అనే సంస్థ తయారుచేసింది. ఈ క్యాప్సూల్ పనితీరును దీని సృష్టికర్త ఫిలిప్ నిట్స్ఖే వివరించారు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారు క్యాప్సూల్లో కూర్చొని మూత పెట్టేసిన తర్వాత.. ఎవరు మీరు? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఈ బటన్ నొక్కితే ఏమవుతుందో తెలుసా? వంటి మూడు ఆటోమేటెడ్ ప్రశ్నలను క్యాప్సూల్ అడుగుతుంది. వీటికి సమాధానం చెప్పిన తర్వాత.. ‘మీరు చనిపోవాలనుకుంటే ఈ బటన్ నొక్కండి’ అనే సందేశం వినిపిస్తుంది.
బటన్ నొక్కిన 30 సెకన్లలో క్యాప్సూల్లో 21 శాతంగా ఉండే ఆక్సిజన్ స్థాయిలు 0.05 శాతానికి పడిపోయి, నైట్రోజెన్ స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో మనిషి ఐదు నిమిషాల పాటు స్పృహ కోల్పోయి, తర్వాత మరణిస్తాడు. ఒకసారి బటన్ నొక్కిన తర్వాత ప్రాణాలు దక్కవని ఫిలిప్ తెలిపారు. క్యాప్సూల్ వినియోగించాలంటే కనీసం 50 ఏండ్ల వయస్సు ఉండాలని, తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారైతే 18 ఏండ్లు దాటాలని చెప్పారు. ఈ క్యాప్సూల్ వినియోగానికి దాదాపు రూ.1,700 ఖర్చవుతాయని ఈ సంస్థ ప్రకటించింది.