వాషింగ్టన్, ఫిబ్రవరి 11: భారత్‌లో గత ఏడాది విద్వేషపూరిత ప్రసంగాలు భారీగా పెరిగాయని వాషింగ్టన్ కేంద్రంగా పని చేసే సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ ఆర్గనైజ్డ్ హేట్(సీఎస్ఓహెచ్)లోని ఇండియా హేట్ ల్యాబ్ పేర్కొన్నది. 2024 ఏడాదిలో భారత్‌లో ద్వేషపూరిత ప్రసంగాలపై ఈ సంస్థ సోమవారం నివేదికను వెలువరించింది. 2024లో దేశంలో 1,165 విద్వేష ప్రసంగాలు ఇచ్చారని, ఇది 2023 కంటే 74 శాతం అధికమని ఈ నివేదిక పేర్కొన్నది.
సాధారణ ఎన్నికల వేడి పతాక స్థాయిలో ఉన్న మే నెలలో ఎక్కువగా ఈ ప్రసంగాలు చేసినట్టు వెల్లడించింది. విద్వేష ప్రసంగాలు చేసిన వారిలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి అనేక మంది రాజకీయ నేతలు ఉన్నట్టు తెలిపింది.ముస్లింల తర్వాత క్రైస్తవులను లక్ష్యంగా ఈ విద్వేష ప్రసంగాలు చేసినట్టు వెల్లడించింది. బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ర్టాల్లో విద్వేష ప్రసంగాలు ఎక్కువగా చేసినట్టు తెలిపింది. 2024లో భారత్‌లో నమోదైన మొత్తం విద్వేష ప్రసంగాల్లో సగానికి పైగా బీజేపీ పాలిత రాష్ర్టాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనే చేసినట్టు వెల్లడించింది.