Vladimir Putin | టీ తాగి ఒకరు మరణించారు.. అపార్టుమెంట్లోని కిటీకిలో నుంచి కింద పడి మరొకరు.. విమానంలో ప్రయాణిస్తూ అనారోగ్యం పాలై ఇంకొకరు.. దుండగుల కాల్పుల్లో మరొకరు.. ఇలా అన్నీ అనుమానాస్పద మరణాలే. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను ప్రశ్నించిన వారి మరణాలన్నీ మిస్టరీనే. పాతికేండ్ల పుతిన్ రాజకీయ ప్రస్థానంలో ఎదురు తిరిగిన ఏ ఒక్కరినీ ఆయన వదిలిపెట్టలేదని ఆయన ప్రత్యర్థులు అంటుంటారు. వారి వాదనలకు బలం చేకూరుస్తూ ఆయనపై తిరుగుబాటు చేసిన రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ మృతి సైతం మిస్టరీగానే మారింది.
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన శత్రువులను అంత సులువుగా విడిచిపెట్టరని అతని రాజకీయ ప్రత్యర్థులు అంటుంటారు. ఈ నేపథ్యంలో రష్యా ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్ కూడా పుతిన్ కుట్రలకు బలయ్యారని, వ్లాదిమిర్ ఖాతాలో ఇటువంటి ఎన్నో మిస్టరీ మరణాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నాయి.
ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీని జైలుకే పరిమితం చేశారు పుతిన్. 2010లో నావల్నీ ఆకస్మికంగా అనారోగ్యం పాలై కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం కోలుకున్న తర్వాత తనపై విష ప్రయోగం జరిగిందని ఆయన చెప్పారు. కొన్నేండ్లకు నావల్నీపై తీవ్రవాదం అభియోగాలు మోపి 19 ఏండ్లు జైలు శిక్ష విధించారు.
మరో ప్రతిపక్ష నేత వ్లాదిమిర్ కారా ముర్జాపై 2015, 2017లో రెండు సార్లు విషం ప్రయోగం జరిగింది. విష ప్రయోగం నుంచి కోలుకున్న అతనిపై రాజద్రోహం అభియోగాలు మోపి 25 ఏండ్ల శిక్ష విధించారు. ఒకప్పటి ఉప ప్రధాని బోరిస్ నెమ్ట్సోవ్ను 2015లో దుండగులు కాల్చి చంపారు. నెమ్ట్సోవ్ మృతి రష్యాను కుదిపేయడంతో ఐదుగురిని జైలుకు పంపించి చేతులు దులుపుకొన్నారు.
మాస్కోలో జరిగిన సాకర్ వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా మైదానంలో నిరసన తెలిపిన పస్సీ రియోట్ గ్రూప్ ఫౌండర్ ప్యోటర్ వెర్జిలోవ్పై 2018లో విష ప్రయోగం జరిగింది.
జర్నలిస్టు అన్నా పొలిట్కోవ్స్కయ మరణంపై విచారిస్తున్న మాజీ ఇంటెలిజెన్స్ ఏజెంట్ అలెగ్జాండర్ లిట్వినెంకోపై 2006లో విష ప్రయోగం జరిగింది. ఆయన తాగిన టీలో పోలోనియం-210 అనే రేడియో ధార్మిక పదార్థాలను గుర్తించారు. మరో మాజీ రష్యన్ ఏజెంట్ సెర్గి స్క్రిపల్, ఆయన కుమార్తెపై కూడా విష ప్రయోగం జరగగా… వారు ప్రాణాలతో బయటపడ్డారు.
జర్నలిస్టు అన్నా పొలిట్కోవ్స్కయ 2006లో కిటికీ నుంచి కింద పడి అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరో జర్నలిస్టు యురి 2003లో అనారోగ్యానికి గురై మరణించారు. ఇలా అనేకమంది రష్యాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం వెనుక పుతిన్ ప్రభుత్వం ఉన్నదనే ఆరోపణలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి.