టెల్అవీవ్, అక్టోబర్ 13: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఇజ్రాయెల్ పార్లమెంట్ సోమవారం అపూర్వరీతిలో తమ గౌరవాన్ని కనబరిచింది. ప్రపంచానికి మరింత మంది ట్రంప్‌ల అవసరం ఉందంటూ కీర్తించిన ఇజ్రాయెల్ పార్లమెంట్ సభ్యులు గాజాతో శాంతి ఒప్పందాన్ని ప్రతిపాదించి విజయం సాధించిన ట్రంప్ గౌరవార్థం కొన్ని నిమిషాల పాటు లేచినిలబడి తమ కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియచేశారు. ట్రంప్‌ని శాంతి అధ్యక్షుడిగా అభివర్ణించిన ఇజ్రాయెల్ పార్లమెంట్ వచ్చే ఏడాది నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును తాము సిఫార్సు చేస్తామని ప్రకటించింది.
ఇజ్రాయెల్‌కు చెందిన అత్యున్నత పౌర పురస్కారానికి మొట్టమొదటిసారి ఇజ్రాయెలీయేతర వ్యక్తిగా ట్రంప్ పేరును నామినేట్ చేసినట్లు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. హమాస్ ప్రచారాన్ని నమ్మి చాలా దేశాలు అటువైపే మొగ్గుచూపడంతో తమ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగిపోయిందని, ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాత్రికిరాత్రే పరిస్థితి మారిపోయిందని ఆయన చెప్పారు.
ఇజ్రాయెల్‌కు ట్రంప్ నిర్దంద్వంగా మద్దతు ప్రకటించడంతో హమాస్‌తో బందీల అప్పగింతకు సంబంధించి రెండవ ఒప్పందం అత్యంత శీఘ్రంగా కుదరిందని నెతన్యాహు తెలిపారు. ట్రంప్‌ని గొప్ప మిత్రుడిగా అభివర్ణించిన నెతన్యాహు ఇజ్రాయెల్‌కు ఇటువంటి మిత్రుడు వైట్ హౌస్‌లో ఇప్పటివరకు లభించలేదని ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ఎవరూ ఇప్పటివరకు ఇజ్రాయెల్‌కు ఇంత మేలు చేయలేదని ఆయన చెప్పారు.
ఎయిర్‌ఫోర్స్ విమానంలో సోమవారం ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ చేరుకున్న ట్రంప్‌నకు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. అనంతరం జెరూసలెంలోని పార్లమెంట్ చేరుకున్న ట్రంప్‌నకు పార్లమెంట్ సభ్యులు కరతాళ ధ్వనులతో స్వాగతం పలికారు. ట్రంప్ వెంట ఆయన ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, అల్లుడు జారెడ్ కుష్నెర్, కుమార్తె ఇవాంక ఉన్నారు. ఇజ్రాయెలీ పార్లమెంట్ స్పీకర్ అమీర్ ఒహానా ట్రంప్‌కి స్వాగతం పలుకుతూ ఈ రోజు కోసమే తామంతా ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ట్రంప్ మరో అమెరికా అధ్యక్షుడు కారని, యూదుల చరిత్రలోనే దిగ్గజమని ఆయన కొనియాడారు. రెండున్నర వేల ఏళ్ల క్రితం జీవించిన సైరస్ ది గ్రేట్‌తో ట్రంప్‌ని ఆయన పోల్చారు. ట్రంప్ లాంటి నాయకులు ఇప్పుడు ప్రపంచానికి అవసరమని ఆయన ప్రకటించారు. 2026 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ట్రంప్‌కు ఇవ్వాలని ఇజ్రాయెల్ కూడా సిఫార్సు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.