Israel | జెనిన్: సాధారణ మహిళలు, వైద్య సిబ్బందిలాగా ఓ దవాఖానలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం ముగ్గురు పాలస్తీనియన్ ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వెస్ట్ బ్యాంక్‌లోని జెనిన్ పట్టణం ఐబీఎన్ సినా దవాఖానలో మంగళవారం ఈ ఘటన జరిగిందని పాలస్తీనా ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఈ ఘటనలో ఎదురు కాల్పులు జరగలేదని దవాఖాన ప్రతినిధి తెలిపారు. దాడిని ఖండించిన ఆరోగ్య శాఖ అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చి దవాఖానల్లో ఇలాంటి ఆపరేషన్లు చేపట్టకుండా చూడాలని కోరింది.
ఉగ్రవాదులు దవాఖానను రక్షణ స్థావరంగా వాడుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఉగ్రవాదుల్లో ఒకరు ఒక దాడి కోసం ఆయుధాలను సరఫరా చేశారని వెల్లడించింది. దవాఖాలపై ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడులు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ చర్చల్లో కొంత పురోగతి కనిపించినా సంపూర్ణ విజయం దక్కే వరకు యుద్ధాన్ని ఆపబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పునరుద్ఘాటించారు.