India-US relation : ఇండో-పసిఫిక్ (Indo-pacific) ప్రాంతంలో చైనా (China) తో జరుగుతున్న వ్యూహాత్మక పోటీలో ఆధిపత్యం పొందాలంటే భారత్ (India) తో సంబంధాలు బలోపేతం చేసుకోవాలని అమెరికా (USA) వార్షిక డిఫెన్స్ పాలసీ బిల్లు పేర్కొన్నది. ‘ది నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్ -2026’ను కాంగ్రెషనల్ నాయకులు ఆదివారం విడుదల చేశారు. దీనిలో అమెరికా రక్షణ మంత్రి భారత్‌తో డిఫెన్స్ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
ఇందుకోసం విదేశాంగశాఖ మంత్రితో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. అప్పుడే ఇండో-పసిఫిక్‌లో చైనాపై ఆధిపత్యం సాధ్యమవుతుందని, ఇందుకు క్వాడ్ కూటమి వంటివి ఉపయోగపడతాయని వెల్లడించారు. అమెరికా విదేశాంగ మంత్రి యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ సెక్యూరిటీ డైలాగ్ వంటి సంప్రదింపుల వ్యవస్థను ఏర్పాటుచేయాలని సదరు బిల్లులో పేర్కొన్నారు. ఇది భారత్-అమెరికా మధ్య 2008లో జరిగిన పౌర అణుఒప్పంద పురోగతిని సమీక్షించాలని సూచించారు.
ఇక ఈ చట్టం అమల్లోకి వచ్చిన 180 రోజుల్లో అమెరికా విదేశాంగ మంత్రి సంయుక్త అంచనాలను నివేదిక రూపంలో ఇవ్వాలని బిల్లులో సూచించారు. అమెరికాలో ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత భారత్ అమెరికా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారత్‌పై 50 శాతం అదనపు టారిఫ్‌లు, ట్రంప్ ప్రకటనలు, హెచ్-1బీ వీసాల ఫీజులు పెంపు వంటి అంశాలు ఇరుదేశాల మధ్య దూరాన్ని పెంచాయి.