వాషింగ్టన్, డిసెంబర్ 23: విదేశీ వృత్తి నిపుణులకు ఇస్తున్న ‘హెచ్1-బీ’ వీసా ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు ప్రతిపాదిస్తూ ట్రంప్ సర్కార్ చేపట్టిన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సరికొత్త వీసా విధానంపై ‘డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ’ ప్రతిపాదనలు రూపొందించగా, వాటిపై (హెచ్1-బీ లాటరీ సిస్టం) తుది సమీక్ష మొదలైంది. నైపుణ్యం, వేతనాల ఆధారిత లాటరీ వ్యవస్థ కోసం రూపొందించిన నిబంధనలను ‘ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్’ సమీక్షిస్తున్నది. ఫెడరల్ నిబంధనల మార్పులపై సమీక్షను చివరి దశగా పరిగణిస్తారు. ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత నిబంధనలు ఖరారు చేసి వాటిని ప్రకటిస్తారు. సమీక్షను పూర్తి చేసి తుది నిబంధనలకు సంబంధించి అడ్వాన్స్ కాపీని త్వరలోనే విడుదల చేయనున్నట్టు సమాచారం. వచ్చే ఏడాది నుంచే హెచ్-1బీ వీసాల జారీకి ఈ కొత్త నిబంధనలను అమలు చేయాలని అమెరికా సర్కార్ భావిస్తున్నది.
అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించేలా అగ్రరాజ్యం కొత్త మార్పులు తీసుకురానున్నది. ప్రస్తుతం హెచ్-1బీ వీసాల జారీకి కంప్యూటరైజ్డ్ లాటరీ విధానాన్ని అనుసరిస్తుండగా, ఇకపై ‘వెయిటెడ్ సెలెక్షన్ సిస్టమ్’ను ప్రవేశ పెట్టనున్నారు. దీని ప్రకారం ఉద్యోగి వేతన స్థాయిని అనుసరించి రిజిస్ట్రేషన్‌లో ప్రాధాన్యం కల్పించటం, వేతన వర్గీకరణ ఆధారంగా దరఖాస్తులను విభజించటం వంటివి చేయనున్నారు. అంటే ఇకపై అధిక వేతనం కలిగిన ఉద్యోగులకు హెచ్-1బీ వీసా లు ఎక్కువగా దక్కే అవకాశం ఉంటుంది.
పీఈఆర్ఎం ప్రోగ్రామ్ ద్వారా యూఎస్ గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియను పునః ప్రారంభిస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. 2023లో భారీ తొలగింపుల మధ్య ఆగిపోయిన ఈ ప్రక్రియను పునః ప్రారంభించాలని కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసినట్టు బిజినెస్ ఇన్సైడర్ వార్తా కథనం తెలిపింది. టెక్ ఉద్యోగుల వీసాలపై ప్రస్తుతం పూర్తి అనిశ్చితి నెలకొన్న క్రమంలో కంపెనీ తన ఇమిగ్రేషన్ పాలసీలో మార్పు చేస్తున్నామన్న విషయాన్ని ఉద్యోగులతో పంచుకుంది. పీఈఆర్ఎం అంటే ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్. ఇది అమెరికా ప్రభుత్వ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఒక విధంగా చెప్పాలంటే అమెరికాలోని ఏదైనా కంపెనీ విదేశీ ఉద్యోగులను శాశ్వతంగా నియమించుకోవాలంటే అది అమెరికా ప్రభుత్వం నుంచి పీఈఆర్ఎం లేబర్ సర్టిఫికేషన్ పొందాలి.
ఆ ఉద్యోగానికి అర్హులైన అమెరికా పౌరులు, గ్రీన్‌కార్డు దారులు లేరని నిరూపించడం, విదేశీ ఉద్యోగులను నియమించడం ద్వారా అమెరికా పౌరులకు నష్టం కలగదని నిర్ధారించడం ఈ సర్టిఫికేషన్ ముఖ్య ఉద్దేశం. గత మూడేండ్లుగా ఈ విధానాన్ని నిలిపివేసిన గూగుల్ ట్రంప్ కఠిన వీసా నిబంధనల కారణంగా పునరుద్ధరించాలని నిర్ణయించింది. 2023లో 12వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన క్రమంలో ఆ ఏడాది జనవరి నుంచి పీఈఆర్ఎం దరఖాస్తులను కూడా గూగుల్ నిలిపివేసింది. ఆ సమయంలో అమెజాన్, మెటా లాంటి దిగ్గజ టెక్ కంపెనీలు కూడా ఆ కార్యక్రమాన్ని నిలిపివేశాయి. ప్రస్తుతం పీఈఆర్ఎం-2026కు దరఖాస్తు చేసుకునే ఉద్యోగులకు కఠినమైన అర్హతా ప్రమాణాలను కంపెనీ నిర్దేశించినట్టు తెలిసింది.