వాషింగ్టన్, బ్రసెల్స్: బ్రౌన్ యూనివర్సిటీ కాల్పుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రామ్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. దీని ప్రభావం భారతీయులపై తీవ్రంగా పడింది. దేశాధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ ప్రోగ్రామ్‌ను ఆపాలని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్‌ను ఆదేశించినట్లు హోం ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ఇచ్చిన ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. బ్రౌన్ విశ్వవిద్యాలయంలో కాల్పులు, ఎంఐటీ ప్రొఫెసర్ హత్య కేసుల్లో అనుమానితుడు పోర్చుగీస్ జాతీయుడు క్లౌడియో నెవెస్ వాలెంటే ఈ ప్రోగ్రామ్ ద్వారానే అమెరికాలో ప్రవేశించాడు.
నెవెస్ గురువారం మరణించి కనిపించినట్లు అధికారులు తెలిపారు. అతను తనను తాను కాల్చుకుని మరణించాడని అనుమానిస్తున్నారు. అమెరికాలో 2025 వీసా లాటరీ కోసం సుమారు 2 కోట్ల మంది దరఖాస్తు చేశారు. 1,31,000 మంది ఎంపికయ్యారు. వీరిలో లాటరీ విజేతల భార్య లేదా భర్త కూడా ఉన్నారు. లాటరీలో గెలిచిన తర్వాత వీరు క్షుణ్ణంగా తనిఖీలు చేయించుకోవాలి, ఆ తర్వాత మాత్రమే వారికి అమెరికాలోకి ప్రవేశం లభిస్తుంది.
అమెరికా బాటలో యూరోపియన్ నడుస్తోంది. వలసలు, ఆశ్రయం విధానాన్ని యూరోపియన్ యూనియన్ సవరించింది. బంగ్లాదేశ్, కొలంబియా, ఈజిప్ట్, కొసావో, భారత దేశం, మొరాకో, ట్యునీషియాలను సురక్షిత దేశాలుగా ప్రకటించింది. ఈ దేశాల నుంచి ఈయూలో ఆశ్రయం కోరేవారి దరఖాస్తులను సత్వరమే పరిశీలించి, ఆశ్రయం పొందేవారి సంఖ్యను తగ్గించనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు యూరోపియన్ యూనియన్, యూరోపియన్ కౌన్సిల్ లేదా 27 ఈయూ దేశాల అధినేతల కూటమి మధ్య కుదిరినట్లు పేర్కొంది. ఈ ఒప్పందంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో భారత్‌లో తాము వివక్షకు, హింసకు గురవుతున్నామంటూ ఈయూలో ఆశ్రయం కోరేవారికి ఇబ్బందులు తప్పవు. వచ్చే జూన్ నుంచి అమల్లోకి వచ్చే ఈ ఒప్పందం ప్రకారం, ఈ ఏడు దేశాల్లో సాయుధ సంఘర్షణల్లో విచక్షణారహిత హింస వంటి పరిస్థితులు లేనట్లయితే, ఆ దేశాలను సురక్షితమైనవిగా పరిగణిస్తారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లక్ష్యం వలస దారులపై కొరడా ఝళిపించడమేనని ఉద్యమకారులు, స్థానిక నేతలు ఆరోపిస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో పోలీసులకు బదులుగా వందలాది మంది నేషనల్ గార్డ్స్ ట్రూప్‌లను, ఫెడరల్ ఏజెంట్లను రంగంలోకి దించుతూ ఆగస్ట్‌లో ట్రంప్ ఓ ఎమర్జెన్సీ ఆర్డర్ అమలు చేశారు. నేరాలను తగ్గించడానికే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అప్పట్లో ఆయన ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆపరేషన్‌కు ముందే నేరాలు తగ్గుముఖం పట్టినట్లు ఉద్యమకారులు చెప్తున్నారు. ఈ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి కొద్ది రోజుల క్రితం వరకు దాదాపు 7,500 మందిని అరెస్ట్ చేశారు.
వీరిలో సుమారు 33 శాతం మంది ఇమిగ్రేషన్ సంబంధిత ఆరోపణలపైనే అరెస్టయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ సెప్టెంబర్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం, అరెస్టయిన 2,400 మందిలో 40 శాతం మంది వలస దారులే. ఈ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి అక్టోబర్ 15 వరకు 1,130 మంది వలసదారులు అరెస్టయ్యారని, వీరిలో 947 మందిపై ఎటువంటి క్రిమినల్ ఆరోపణలు లేవని యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ గణాంకాలు చెప్తున్నాయి. ముసుగు ధరించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, గుర్తింపు వివరాలు లేని వాహనాల్లో వలసదారులను తీసుకెళ్తుండటం కనిపిస్తున్నదని స్థానికులు వెల్లడించారు.