ఇస్లామాబాద్: ప్రజల ప్రాణాలతో చెలగాటం అడుతున్నది పాకిస్థాన్ ప్రభుత్వం. ప్రజలకు వంట గ్యాస్ కూడా సరఫరా చేయలేకపోతున్నది. కనీసం గ్యాస్ సిలిండర్లను కూడా అందించలేకపోతున్నది. దీంతో ప్రజలు ప్లాస్టిక్ కవర్లలో వంట గ్యాస్ నింపుకొని వాడుకుంటున్నారు. ఇది అత్యంత ప్రమాదకరం. ఒకరకంగా చెప్పాలంటే బాంబును ఇంట్లో పెట్టుకున్నట్లే. వీటి కారణంగా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా గత్యంతరం లేక ప్రజలు వీటినే వాడుతున్నారు.
ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్‌లో 2007 నుంచి పాక్ ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం లేదు. హంగు నగరంలో రెండేళ్లుగా దెబ్బతిన్న పైప్‌లైన్ రిపేర్ చేయించకపోవడంతో గ్యాస్ సరఫరా జరగడం లేదు. దీంతో కొందరు వ్యాపారులు కంప్రెషర్ ఉపయోగించి వంట గ్యాస్‌ను ప్లాస్టిక్ కవర్లలో నింపి విక్రయిస్తున్నారు. ప్రజలు వీటికి చిన్న ఎలక్ట్రిక్ సక్షన్ పంప్ ఉపయోగించి స్టవ్‌కు పెడుతున్నారు.