సోఫియా, డిసెంబర్ 2: మరో దేశంలో జెన్జీ ఉద్యమం రాజుకుంది. బల్గేరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువత ఆందోళనబాట పట్టింది. వేల సంఖ్యలో యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన 2026 బడ్జెట్ ముసాయిదా వారి ఆగ్రహానికి కారణమైంది. పన్నులు, పలు కీలక సంస్థలపై ప్రభుత్వ అధికారాలను మరింత విస్తరించనున్నామని ఆ ముసాయిదాలో ప్రతిపాదించారు. దీనికి పెద్ద ఎత్తున వ్యతిరేకత తెలుపుతున్న యువత మంగళవారం బల్గేరియా పార్లమెంట్ వద్దకు వేల సంఖ్యలో చేరుకున్నారు.
1990 తరువాత ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి అని సోఫియా మేయర్ వాసిల్ టెర్జీవ్ అన్నారు. ‘జెన్జీ వస్తున్నది’, ‘మాఫియా లేని బల్గేరియా’ అన్న బ్యానర్లు ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పన్నుల పెంపు, తగ్గిన ఉపాధి అవకాశాలు, అవినీతి కారణంగా ఓ తరం యువత మొత్తం విదేశాల బాట పట్టిందని నిరసనకారులు పేర్కొన్నారు.