టెల్ అవీవ్, సెప్టెంబర్ 8: సుమారు మూడేండ్ల క్రితం 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన భీకర దాడిలో 1200 మంది మరణించగా, 250 మందికి పైగా పౌరులు బందీ అయ్యారు. అయితే ఈ దాడి గురించి ఇజ్రాయెల్ ప్రధానికి ముందస్తు సమాచారం వచ్చినా ఆయన నిర్లక్ష్యం చేసి పట్టించుకోలేదని వచ్చిన ఒక మీడియా కథనం సంచలనం సృష్టించింది. ఇజ్రాయెల్‌పై పాలస్తీనా గ్రూపులు భీకర దాడి చేయవచ్చునని దాడికి కొన్ని రోజుల ముందు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహును హెచ్చరించారు. ‘జిల్జాల్’ లేదా భూకంపం పేరిట ఒక భారీ దాడి ప్రణాళికను మాజీ హమాస్ నేత యహ్యా సిన్వార్ రచించినట్టు ఆయన చెప్పారు.
45 నిమిషాల పాటు నెతన్యాహుతో జరిపిన ఫోన్ సంభాషణలో జరగబోయే దాడి పట్ల ఆందోళన వ్యక్తం చేశారని ఇజ్రాయెల్ వార్తాసంస్థ హారెట్జ్ వెల్లడించింది. దీనిపై ప్రశాంతంగా స్పందించిన నెతన్యాహు.. తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామని, ఎలాంటి ఆందోళన చెందవద్దని కోరారు. అయితే తనకు వచ్చిన ఈ హెచ్చరికను ఆయన తేలిగ్గా తీసుకుని దేశ రక్షణ అధికారులు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌కు తెలియచేయడంలో విఫలమయ్యారు. తత్ఫలితంగా 1200 మందికి పైగా ఇజ్రాయెల్ వాసులు మరణించారు. అందులో చాలామంది సామాన్య పౌరులే ఉన్నారు. కాగా, ఈ వార్తా కథనాన్ని ఇజ్రాయెల్ అధికారులు ఖండించారు. ఆ రోజు హమాస్ దాడి గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని, నెతన్యాహు, బిన్లు ఎలాంటి ఫోన్ సంభాషణ జరపలేదని స్పష్టం చేశారు.