115 ఏండ్ల క్రితం ఆ వ్యాధిని గుర్తించారు. ఆ రోగాన్ని నయం చేయడానికి ఇప్పటికే వేలాది కోట్లను ఖర్చుచేశారు. వందలాది ట్రయల్స్ నిర్వహించారు. అయితే, తాత్కాలిక ఉపశమన చర్యలే తప్ప, దాని అంతు చూడలేకపోయారు. ఆ వ్యాధే ‘అల్జీమర్స్’. శతాబ్దకాలంగా అదుపుచేయలేని ఆ వ్యాధిని పూర్తిస్థాయిలో నయంచేసే సమయం ఆసన్నమైంది. వచ్చే పదేండ్లలో అల్జీమర్స్ చికిత్సలో కీలక ముందడుగు పడనున్నట్టు బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది అల్జీమర్స్‌తో నిత్యం సతమతమవుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఔషధాలతో ఆ వ్యాధిలోని కొన్ని లక్షణాలను తాత్కాలికంగా నయం చేయగలుగుతున్నారు. అంతేతప్ప.. ఆ వ్యాధి పెరుగుదలను నియంత్రించే థెరపీలు, రోగాన్ని శాశ్వతంగా తరిమికొట్టే మందులు ఇప్పటివరకూ అందుబాటులో లేవు. అయితే వచ్చే పదేండ్లలో ఆ దిశగా అడుగులు పడనున్నట్టు బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ మార్క్ డల్లాస్ తెలిపారు.
ఏమిటీ అల్జీమర్స్?
మెదడులో జ్ఞాపకశక్తి కణాలు క్రమంగా పనిచేయకపోవడంతో అల్జీమర్స్ వస్తుంది. వయసు పెరగడం, మధు మేహం బీపీ, జన్యువులు, ధూమపానం, ఊబకాయం కూడా కారణం కావచ్చు. ఎలాంటి ఔషధాలు లేవు. వ్యాధి లక్షణాలు, ప్రవర్తనలు తగ్గించడానికి తాత్కాలిక చికిత్సలు ఉన్నాయి.
శాశ్వత చికిత్సకు ముందడుగు
నిజజీవితంలో జరిగే సంఘటనలు, విషయాలను భద్రపర్చుకునే మెదడులోని ప్రొటీన్ కణాలపైనే డెమెన్షియా కారక కణాలు దాడి చేస్తాయి. దీంతో వ్యాధికారక కణాలు దాడి చేసిన ప్రాంతాన్ని స్టెమ్ కణాలతో మరమ్మతు చేయడంపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు. ఆక్సిజన్ థెరపీ ద్వారా మెదడుకు ప్రాణవాయువు సరఫరా పెరిగి కణాలు ఉత్తేజితం అవుతున్నట్టు గుర్తించారు. పాడైన కణాలను స్టెమ్ సెల్స్‌తో మరమ్మతు చేస్తారు. ఇలా అల్జీమర్స్‌ను దశలవారీగా పూర్తిస్థాయిలో నయం చేస్తారు.