వాషింగ్టన్, ఏప్రిల్ 5: అమెరికా గడ్డపై పుట్టడం ఒక్కటే పౌరసత్వానికి ఆధారం కాదని అమెరికా సుప్రీంకోర్టులో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ వాదనలు వినిపించింది. గత గురువారం న్యాయస్థానం ముంగిట వాదోపవాదనలు జరగగా, ‘బర్త్ రైట్ సిటిజన్షిప్’ను రద్దు చేయటాన్ని ట్రంప్ సర్కార్ సమర్థించుకుంది. కాగా, ఫెడరల్ సర్కార్ వాదనలపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పలు సందేహాలు వ్యక్తం చేశారు. బిడ్డ వారసత్వాన్ని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. అటువంటి విధానం (ట్రంప్ ఆదేశాలు) ఆచరణలో ఎలా పనిచేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నవజాత శిశువు పౌరసత్వ హోదాను ఎలా నిర్ధారిస్తారనే దానిపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రతి కేసులోనూ వలస అధికారులు తల్లిదండ్రుల హోదాను ధృవీకరించాల్సిన అవసరం ఉంటుందా? తనిఖీలను ఎలా అమలు చేస్తారు? అనే విషయాల్ని న్యాయమూర్తులు పరిశీలించారు. ‘బర్త్ రైట్ సిటిజిన్షిప్’ను ట్రంప్ రద్దు చేయటంపై పలువురు ప్రవాస భారతీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హెచ్1-బీ వీసాపై పనిచేస్తున్న లక్షలాది భారతీయులపై తీవ్ర ప్రభావం పడుతున్నదని కోర్టుకు తెలియజేశారు.