Diabetes | వాషింగ్టన్: మధుమేహాన్ని శ్వాస వదిలినంత సునాయాసంగా నిర్ధారించే రోజులు రాబోతున్నాయి. శ్వాసలోని ఎసిటోన్‌ను గుర్తించే సెన్సర్‌ను పరిశోధకులు అభివృద్ధి చేయడంతో ఇది సాధ్యం కాబోతున్నది. దీని ద్వారా మధుమేహం, ప్రీడయాబెటిస్‌ను వేగంగా, చౌకగా గుర్తించవచ్చు. పెన్సిల్వేనియా స్టేట్ యూనవర్సిటీ పరిశోధకులు ఈ సెన్సర్‌ను అభివృద్ధి చేశారు. ‘కెమికల్ ఇంజినీరింగ్’ జర్నల్‌లో ఈ పరిశోధన ఫలితాలను ప్రచురించారు. ప్రస్తుత పద్ధతుల్లో డయాబెటిస్, ప్రీడయాబెటిస్‌ను గుర్తించాలంటే డాక్టర్‌ను సంప్రదించవలసి ఉంటుంది, ల్యాబ్ వర్క్ జరగవలసి ఉంటుంది. వీటికి డబ్బు, సమయం అధికంగా అవసరమవుతాయి.
రక్తం లేదా చెమటలోని గ్లూకోజ్‌ను ఉపయోగించి ఈ పరీక్షను చేస్తారు. కరిగే కొవ్వుకు ఉప ఉత్పత్తిగా ఎసిటోన్ ప్రతి ఒక్కరి శ్వాసలోనూ ఉంటుంది. అయితే, ఎసిటోన్ లెవెల్స్ 1.8 పార్ట్స్ పెర్ మిలియన్ కన్నా ఎక్కువగా ఉంటే, మధుమేహం ఉన్నట్లు నిర్ధారణ చేయవచ్చు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన హువాన్యు ‘లారీ’ చెంగ్ మాట్లాడుతూ, చెమటలోని గ్లూకోజ్‌ను గుర్తించే సెన్సర్లు ఉన్నప్పటికీ, వ్యాయామం, రసాయనాలు లేదా వేడి గాలి, ఆవిరి స్నానానికి ఉపయోగించే గది అవసరమవుతాయన్నారు.
ఈ పద్ధతి అన్నివేళలా ఆచరణ సాధ్యమైనది కాదన్నారు. తాము అభివృద్ధి చేసిన విధానంలో, ఓ వ్యక్తి శ్వాసను ఓ సంచిలోకి వదిలితే, ఆ సంచిలో తాము తయారు చేసిన సెన్సర్‌ను ఉంచాలని చెప్పారు. కొన్ని నిమిషాల తర్వాత ఫలితాలు వెల్లడవుతాయని తెలిపారు. నేరుగా ముక్కు క్రింద కానీ, మాస్క్ లోపల కానీ పని చేసే సరికొత్త సెన్సర్‌ను అభివృద్ధి చేయడం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.