Omicron + Delta | మానవాళిని వణికిస్తున్న కరోనా ఇప్పట్లో వదిలే సూచనలేం కనిపించడం లేదు. రోజుకో కోవిడ్ వేరియంట్ పుట్టుకొస్తోంది. డెల్టా.. డెల్టా ప్లస్.. వాటిని మించిన వేరియంట్ ఒమిక్రాన్‌తో దేశాలన్నీ గజగజ వణుకుతున్నాయి. మరో సూపర్ వేరియంట్ ముప్పు పొంచి ఉందని బ్రిటన్ ఆరోగ్య నిపుణుడు డాక్టర్ పాల్ బర్టన్ హెచ్చరించారు. కరోనా వైరస్ ఎప్పటికప్పుడు డీఎన్ఏ మార్చుకుంటున్నది. తాజాగా ఒమిక్రాన్, డెల్టా స్ట్రెయిన్స్ రెండూ కలిసి ఇన్ఫెక్ట్ అయితే సూపర్ వేరియంట్ ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బ్రిటన్‌లో డెల్టా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో సూపర్ వేరియంట్‌పై ప్రజల్లో ఆందోళనలు తలెత్తుతున్నాయి.
సాధారణంగా కరోనా వైరస్ మానవులకు ఒకసారి మాత్రమే సోకుతుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే రెండు స్ట్రెయిన్లు కలిసి ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ బర్టన్ చెప్పారు. ఒకవేళ డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు రెండూ ఒక కణంలోకి ఇన్ఫెక్ట్ అయితే.. ఒక స్ట్రెయిన్ డీఎన్ఏ.. మరొకదాంతో మార్చుకుంటాయి. ఈ రెండు కలిస్తే ప్రమాదకర సూపర్ స్ట్రెయిన్ పుట్టుకొస్తుందని హెచ్చరించారు. ఈ రెండు వైరస్లు జన్యువులు మార్చుకుంటాయన్నారు.
న్యూ సౌత్‌వేల్స్ యూనివర్సిటీ వైరాలజిస్ట్ పీటర్ వైట్ తొలిసారి సూపర్ స్ట్రెయిన్ ఆవిర్భవించే ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు. జనవరిలో స్పెయిన్‌లో వెలుగు చూసిన కొన్ని కేసుల్లో ఆల్ఫా స్ట్రెయిన్‌తో బీ.1.177 స్ట్రెయిన్ కలిసిపోయినట్లు నివేదికలు వచ్చాయని బ్రిటన్ ఆరోగ్య నిపుణులు చెప్పారు. ఫిబ్రవరిలో కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు.. కరోనా కెంట్ స్ట్రెయిన్, బీ-1.429 వేరియంట్ కలిసిపోయాయని గుర్తించారు.
గత మూడు రోజుల్లోనే బ్రిటన్‌లో 11,708 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 93 వేలకు పైగా కరోనా కేసులు రికార్డయ్యాయి. ప్రతి ఐదుగురిలో ఒకరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. 91 దేశాల్లో న్యూ వేరియంట్ విస్తరించింది. డెన్మార్క్‌లో 9,009 ఒమిక్రాన్, నార్వేలో 1792, సౌత్ ఆఫ్రికాలో 1247 కేసులు రికార్డయ్యాయి. బ్రిటన్ తరహాలో భారత్‌లో ఒమిక్రాన్ విస్తరిస్తే ప్రతిరోజూ 14 లక్షల కేసులు నమోదవుతాయని నీతి ఆయోగ్ హెచ్చరించింది.