బీజింగ్ : రైలు ప్రయాణంలో విప్లవం దిశగా చైనా ముందడుగు వేసింది. గంటకు 600 కి.మీ. వేగంతో ప్రయాణించే రైలును ఆ దేశం అభివృద్ధి చేసింది. ఇది మాగ్నెటిక్ లెవిటేషన్ (మాగ్లెవ్) రైలు. ఇది బీజింగ్ నుంచి 1,200 కి.మీ. దూరంలోని షాంఘైకి 150 నిమిషాల్లో చేరుకోగలదు. ప్రస్తుతం హైస్పీడ్ రైలు 5.5 గంటల్లో చేరుకుంటున్నది. మాగ్లెవ్ టెక్నాలజీ చాలా ప్రత్యేకమైనది. పట్టాలపై నుంచి రైలు బయల్దేరడానికి ఈ టెక్నాలజీ ప్రతిఘటించే అయస్కాంత క్షేత్రాలను ఉపయోగించుకుంటుంది. దీనివల్ల ఘర్షణ తగ్గుతుంది, సున్నితంగా, ప్రశాంతంగా, అత్యంత వేగంతో ప్రయాణించేందుకు అవకాశం కలుగుతుంది. ఈ రైలును చైనా రైల్వే రోలింగ్ స్టాక్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది.
హుబేయి ప్రావిన్స్‌లోని డొంఘు ల్యాబొరేటరీలో జూన్‌లో నిర్వహించిన ప్రయోగాత్మక పరీక్షలో, 1.1 టన్నుల మాగ్లెవ్ రైలు 7 సెకండ్ల కన్నా తక్కువ సమయంలో గంటకు 650 కి.మీ. వేగాన్ని అందుకుంది. 600 మీటర్ల టెస్ట్ ట్రాక్ మీద ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ పరీక్షలను దాదాపు శూన్య గాలి ప్రతిఘటన గల వాక్యూమ్ ట్యూబ్‌లో నిర్వహించారు. ఈ పద్ధతిలో ఘర్షణ, రణగొణ ధ్వనులు లేని, నిశ్శబ్ద ప్రయాణానికి అవకాశం ఉంటుంది.
ఈ రైలును సూది ముక్కుతో కూడిన ఏరోడైనమిక్ బాడీతో రూపొందించారు. దీనివల్ల ఈ రైలు గాలి ప్రతిఘటనను చీల్చుకుంటూ దూసుకెళ్లగలదు. ప్రయాణికుల కోసం విశాలమైన క్యాబిన్లు, విశాలమైన డిజిటల్ డిస్ప్లే స్క్రీన్లు ఉన్నాయి.