Alaska Triangle | న్యూయార్క్, ఫిబ్రవరి 8: అమెరికాలోని అలస్కా ట్రయాంగిల్ ఒక అంతుచిక్కని ప్రదేశం. అక్కడ పర్యటించే వేలాది మంది జాడ కూడా దొరకదు. ఈ ప్రాంతంపై నుంచి ప్రయాణించే విమానాలు గల్లంతవుతున్నాయి. తాజాగా 10 మందితో ప్రయాణిస్తున్న విమానం గల్లంతవడంతో అలస్కా ట్రయాంగిల్ మరోసారి వార్తల్లోకెక్కింది. అమెరికాలోని అలస్కా రాష్ట్రంలో యాంకరేజ్, జునేయు, ఉట్కియాగ్వి మధ్య త్రికోణాకారంలో విస్తరించి ఉన్న ప్రాంతాన్ని అలస్కా ట్రయాంగిల్ అంటారు. ఎత్తయిన మంచుకొండలతో ఉన్న ఈ ప్రాంతంలో 1972 నుంచి పలు విమానాలు జాడ కోల్పోయాయి. ఈ ప్రాంతంలో పర్యటించే వేలాది మంది పర్యటకులు ప్రతియేటా గల్లంతవుతున్నారు.
రోజుల తరబడి సాగే సెర్చ్ ఆపరేషన్లు విఫలమవుతున్నాయి. ఎంత వెతికినా గల్లంతైన వారి ఆచూకీ దొరకడం లేదు. 1972 నుంచి ఇప్పటివరకు అలస్కా ట్రయాంగిల్లో దాదాపు 20 వేల మంది ఆచూకీ లభించలేదు. ప్రతియేటా సగటున 2,250 మంది ఇక్కడ గల్లంతవుతున్నారని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. ప్రతికూల వాతావరణమో, భౌగోళిక పరిస్థితుల ప్రభావమో కానీ అలస్కా ట్రయాంగిల్ అంటేనే అమెరికన్లలో ఒక ఆందోళన కలుగుతుంది. దీనిపైన టీవీ షోలు, డాక్యుమెంటరీలు సైతం తెరకెక్కాయి.