Thaksin Shinawatra : థాయ్‌లాండ్ (Thailand) మాజీ ప్రధాన మంత్రి (Former Prime minister) థక్సిన్ షినవత్ర (Thaksin Shinawatra) కు ఆ దేశ సుప్రీంకోర్టు (Supreme Court) షాకిచ్చింది. గతంలో ఓ కేసులో విధించిన శిక్షను షినవత్ర సరిగ్గా అనుభవించలేదనే కారణంతో మరోసారి ఏడాదిపాటు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.
2006లో సైనిక తిరుగుబాటుతో థాయ్‌లాండ్ మాజీ ప్రధాని థక్సిన్ షినవత్ర పదవి నుంచి వైదొలిగారు. 2008లో రాజకీయ ప్రేరేపిత ఆరోపణలపై ఆయనకు జైలుశిక్ష విధించడంతో థక్సిన్ దేశం విడిచి పారిపోయారు. విదేశాల్లో ఉంటున్న షినవత్ర 15 ఏళ్ల తర్వాత 2023లో థాయ్‌లాండ్‌కు తిరిగొచ్చారు. ఆయన స్వదేశానికి తిరిగొచ్చిన తర్వాత గతంలో నమోదైన కేసులో భాగంగా ఆయనకు సుప్రీంకోర్టు 8 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
అయితే థక్సిన్ అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ దేశపు రాజు శిక్షను ఏడాదికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శిక్షను తగ్గించినప్పటికీ వైద్య కారణాలతో థక్సిన్ ఒక్కరోజు కూడా జైల్లో శిక్ష అనుభవించకపోవడంతో అక్కడి ప్రజల్లో పలు అనుమానాలు మొదలయ్యాయి. ఆయన నిజంగానే అనారోగ్యానికి గురయ్యారా లేదా శిక్ష నుంచి తప్పించుకోవడానికి తప్పుడు ఆధారాలు సృష్టించారా..? అనే ప్రశ్నలు లేవనెత్తారు.
ఈ అనుమానాల వేళ అప్పట్లో సరిగ్గా శిక్ష అనుభవించని కారణంగా థక్సిన్‌కు ఏడాదిపాటు జైలుశిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తాజా తీర్పు వెలువరించింది. కాగా కాంబోడియా సెనెట్ అధ్యక్షుడు హన్‌సేన్‌తో థాయ్‌లాండ్ ప్రధాని, థక్సిన్ కుమార్తె పేటోంగ్టార్న్ షినవత్ర (Paetongtarn Shinawatra) ఫోన్లో మాట్లాడటం సంచలనం రేపడంతో ఇటీవల అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం ఆమెను పదవి నుంచి తొలగించింది.