Thailand PM : థాయ్‌లాండ్ (Thailand) తదుపరి ప్రధానిగా అనుతిన్ చార్న్విరాకుల్ (Anutin Charnvirakul) ను అక్కడి పార్లమెంట్ (Parliament) ఎన్నుకుంది. మాజీ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర (Paetongtarn Shinawatra) ను అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది.
భూమ్ జైతై పార్టీకి చెందిన అనుతిన్.. షినవత్ర నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో పనిచేశారు. గత రెండేళ్లలోనే థాయ్‌లాండ్‌కు మూడో ప్రధాని రావడం గమనార్హం. కాగా కాంబోడియా సెనేట్ అధ్యక్షుడు హన్‌సేన్‌తో ఇటీవల థాయ్‌లాండ్ ప్రధాని షినవత్ర ఫోన్లో మాట్లాడటం సంచలనం రేపింది. ఇరుదేశాల మధ్య సరిహద్దు వివాదాలు తీవ్రంగా ఉన్న సమయంలో పొరుగు దేశం నేతతో కీలక విషయాలు పంచుకున్న తీరు వివాదాస్పదమైంది.
దానిపై విచారణ జరిపిన దేశ రాజ్యాంగ న్యాయస్థానం షినవత్ర తీరు నైతిక ప్రమాణాలను ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. రాజ్యాంగం ప్రకారం ఇటువంటి వారికి ప్రధాని స్థానంలో ఉండే అర్హత లేదని పేర్కొంటూ ఆమెను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. దాంతో షినవత్ర ప్రధాని పదవి నుంచి వైదొలిగారు.