బ్యాంకాక్, జనవరి 3: థాయ్లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినవత్ర తనకు భారీ ఆస్తులున్నట్టు శుక్రవారం ప్రకటించారని ఆమె పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె దగ్గర రూ.17 కోట్ల విలువైన 200 డిజైనర్ బ్యాగులు, రూ.42 కోట్ల విలువైన 75 లేటెస్ట్ లగ్జరీ వాచ్లు ఉన్నాయని స్థానిక మీడియా తెలిపింది. జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్కు ఆమె ఈ వివరాలు సమర్పించారు. తనకు మొత్తం రూ.3,430 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు షినవ్రత తెలిపారు.
టెలికం బిలియనీర్, థాయ్ మాజీ ప్రధాని థక్సిన్ షినవ్రత చిన్న కూతురైన పేటోంగ్టార్న్ గతేడాది సెప్టెంబర్లో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తనకు 11 బిలియన్ బాత్(థాయ్ కరెన్సీ) పెట్టుబడులు ఉన్నాయని ఆమె తెలిపారు. తనకు సుమారు అయిదు బిలియన్ బాత్ల అప్పులున్నట్టు కూడా ఆమె ప్రకటించారు. థక్సిన్ కుటుంబం షిన్ కార్ప్ టెలికమ్యూనికేషన్ కంపెనీతో వ్యాపారంలో బాగా లాభాలు గడించింది. ఆ తర్వాత ఆయన కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది. పేటోంగ్టార్న్ తన కుటుంబం నుంచి థాయ్ ప్రధానిగా ఎన్నికైన నాలుగో వ్యక్తి.