బ్యాంకాక్, ఆగస్టు 22: అంతర్జాతీయ పర్యాటకులకు థాయ్లాండ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశీ పర్యాటకులు ఆ దేశంలో ఉచితంగా విమాన ప్రయాణం చేసే ప్రణాళికను సిద్ధం చేసింది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు దీనికోసం సుమారు 187 కోట్ల రూపాయలను తన బడ్జెట్లో కేటాయించే ప్రతిపాదనను మంత్రివర్గ ఆమోదం కోసం పంపింది.
ఈ పథకం ద్వారా 2 లక్షల మందికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ‘ద నేషన్ థాయ్లాండ్’ పత్రిక వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆరు వైమానిక సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ పథకం కింద ప్రభుత్వం ఒక వైపు ప్రయాణానికి 1,750 బాట్లు (రూ.4,700) , రౌండ్ ది ట్రిప్పు ప్రయాణానికి 3,500 బాట్లు (రూ.9,400) సబ్సిడీగా ఇస్తుంది.