చాంతబురి: థాయిలాండ్, కంబోడియా దేశాల మధ్య కాల్పుల విరమణ(Ceasefire Agreement) ఒప్పందం జరిగింది. రెండు దేశాలకు చెందిన రక్షణ మంత్రులు ఇవాళ దీనిపై సంయుక్త ప్రకటన చేశారు. కంబోడియా రక్షణ మంత్రి టీ సేహ, థాయిలాండ్ మంత్రి నట్టఫోన్ నర్కఫనిట్ కాల్పుల విమరణ ఒప్పందంపై సంతకాలు చేశారు. థాయ్‌లోని చాంతబురి ప్రావిన్సులో ఇద్దరు మంత్రల మీటింగ్ జరిగింది. సైనిక బలగాల కదలికలపై రెండు దేశాలు తక్షణ ఆంక్షలు విధించాయి. బోర్డర్ వద్ద ఉన్న సాధారణ పౌరులు స్వంత ఇండ్లకు చేరుకునే అవకాశం కల్పించారు.
గత కొన్నాళ్ల నుంచి థాయ్, కంబోడియా బోర్డర్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. బోర్డర్ కాల్పుల్లో సుమారు 41 మంది మరణించారు. లక్షల సంఖ్యలో జనం తరలి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం నుంచి కాల్పుల విరమణ అమలులోకి రానున్నది. థాయ్‌ల్యాండ్ ఆధీనంలో ఉన్న 18 మంది కంబోడియా సైనికులను త్వరలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. కొన్ని రోజుల పాటు జరిగిన చర్చల ఫలితంగా థాయ్, కంబోడియా మధ్య ఒప్పందం కుదిరింది.