బ్యాంకాక్, జూలై 2: అర్జున్, రఘువరన్, మనీషా కొయిరాలా నటించిన 1999 నాటి ఒకే ఒక్కడు సినిమా గుర్తుందా? ఆ సినిమాలో జర్నలిస్టుగా నటించిన అర్జున్ తన టీవీ చానెల్ ఇంటర్వ్యూలో.. సీఎంగా ఉన్న రఘువరన్‌తో సవాలు చేసి ఒక్కరోజు ముఖ్యమంత్రి అవుతాడు. థాయ్‌లాండ్‌లో కూడా ఇప్పుడు ఆ సినిమాలోని పరిస్థితులే నెలకొన్నాయి. ఆ దేశ డిప్యూటీ ప్రధాని సూరియా జంగ్రంగ్రియాంగ్కిట్ బుధవారం ఒక్కరోజు కోసం దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 24 గంటలపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈ మధ్యలో దేశ మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నారు.
ప్రస్తుత ప్రధాని పీతోంగ్టార్న్ షినవత్రను థాయ్‌లాండ్ కోర్టు మంగళవారం సస్పెండ్ చేయడంతో దేశంలో మంత్రివర్గాన్ని మార్చాల్సి వచ్చింది. మాజీ ప్రధాని థక్సిన్ షినవత్ర కుమార్తె అయిన పీతోంగ్టార్న్ కంబోడియాతో జరిగిన దౌత్య వ్యవహారంలో ప్రధానమంత్రిగా నైతికతను ఉల్లంఘించారని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయని కోర్టు పేర్కొన్నది. ఓ ఫోన్ సంభాషణలో కంబోడియా మాజీ అధినేత హున్‌సేన్‌ను ‘అంకుల్’ అని సంబోధించిన పీతోంగ్టార్న్.. తమ దేశ సైనిక కమాండర్‌ను తన విరోధి అని పేర్కొనడం వివాదానికి దారితీసింది. దేశ సరిహద్దుల్లో కంబోడియాతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో స్వయంగా ప్రధాని తమ దేశ సైనిక కమాండర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. కోర్టు తీర్పు నేపథ్యంలో సీనియర్ నాయకుడు 70 ఏండ్ల ఉప ప్రధాని సూరియా జంగ్రంగ్రియాంగ్కిట్కు ప్రధాని బాధ్యతలు అప్పగించారు.