సిడ్నీ, డిసెంబర్ 14: ఆస్ట్రేలియాలో యూదుల హనుక్కా ఉత్సవంపై ఉగ్ర దాడి జరిగింది. క్రిస్మస్ సందర్భంగా రద్దీగా ఉండే సిడ్నీలోని బోండీ బీచ్ మార్కెట్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా 11 మంది మరణించగా, ఇద్దరు పోలీసులు సహా 30 మంది గాయపడ్డారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఇది యూదుల లక్ష్యంగా జరిగిన దాడి అని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఉగ్ర దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల్లో ఒకడు నవీద్ అక్రమ్ అని పోలీసులు గుర్తించారు. ఇతను నైరుతి సిడ్నీలోని బోన్నీరిగ్లో నివసిస్తున్నట్లు తెలిపారు. కొన్ని నెలలుగా ప్రణాళిక రచించి, ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలల ఆట స్థలం వద్ద ఈ దాడి జరిగింది. పోలీసుల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు.
మరొక దుండగుడు తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుల్లో ఒకరు పాక్ సంతతి వ్యక్తి అని సమాచారం. కనీసం మూడు తుపాకులతో కాల్పులు జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన బెల్ట్‌లను ధరించినట్లు చెప్పారు. ఎన్ఎస్డబ్ల్యూ పోలీసులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ హుటాహుటిన స్పందించాయి. హెలికాప్టర్లు, ఇంటెన్సివ్ కేర్ పారామెడిక్స్, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్స్ సహా 26 యూనిట్లను మోహరించారు. బోండీ బీచ్‌కు ప్రతి రోజూ వేలాది మంది సందర్శకులు వస్తారు. 11 ఏళ్ల క్రితం ఓ దుండగుడు ఇక్కడ 18 మందిని నిర్బంధించాడు. ఉగ్రదాడి నుంచి ప్రముఖ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ తృటిలో తప్పించుకున్నారు. ఆస్ట్రేలియా బీచ్ దాడిని ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు.
హమాస్ దాడిలో తప్పించుకొని..సిడ్నీలో గాయపడి
ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు జరిపిన దాడి నుంచి తప్పించుకున్న వ్యక్తి సిడ్నీ దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఇది రక్తపాతమని, ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితిలో, ప్రాణాల కోసం పరుగులు తీశామని ఆయన తెలిపారు. యాంటీ సెమిటిజంతో యూదులతో కలిసి పోరాడటం కోసం తాను రెండు వారాల క్రితమే ఆస్ట్రేలియాకు వచ్చానని చెప్పారు.
ఆస్ట్రేలియా పీఎం దిగ్భ్రాంతి
బోండీ బీచ్‌లో కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఉగ్రవాద చర్య అని, హనూక్కా ఉత్సవాల తొలి రోజున ఆస్ట్రేలియన్ యూదులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి పోలీసులు, ఎమర్జెన్సీ టీమ్స్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. బాధితులకు సంఘీభావం ప్రకటించారు. క్యాబినెట్ జాతీయ భద్రతా కమిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
యాంటీ సెమిటిజం అగ్నికి ఆస్ట్రేలియా ఆజ్యం: నెతన్యాహు
జెరూసలెం: సిడ్నీలో ఆదివారం జరిగిన ఉగ్ర దాడి నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వంపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టెలివైజ్డ్ ప్రసంగంలో నెతన్యాహు మాట్లాడుతూ, తాను మూడు నెలల క్రితమే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ను హెచ్చరించానని చెప్పారు. ప్రత్యేక హోదా గల పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రకటించిన నేపథ్యంలో తాను ఈ లేఖను ఆగస్టులో రాశానని వివరించారు. యాంటీసెమిటిజం అగ్నిలో అల్బనీస్ విధానాలు ఆజ్యం పోస్తున్నాయని చెప్పానని తెలిపారు. నేతలు మౌనంగా, చర్యలు చేపట్టకుండా ఉన్నపుడు యాంటీ సెమిటిజం అనే క్యాన్సర్ వ్యాపిస్తుందన్నారు.
ప్రాణాలకు తెగించి.. ఉగ్రవాదితో పోరాడి

సిడ్నీలో జరిగిన ఉగ్ర దాడికి సంబంధించిన ఓ వీడియోలో ఓ వ్యక్తి ప్రదర్శించిన ధైర్యసాహసాలు కనిపించాయి. ఉగ్రవాదుల కాల్పుల శబ్దాలను విని జనం భయాందోళనలతో పారిపోతుండగా, ఓ ఉగ్రవాదికి సమీపంలో ఉన్న వ్యక్తి అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు. ఆ ఉగ్రవాది వద్దనున్న తుపాకీని లాక్కుని తిరిగి అతనికే గురిపెట్టారు. మరో వీడియోలో, మరొక ఉగ్రవాది ఎత్తుగా ఉన్న నడక దారిపై నిల్చుని కిందనున్న జనంపై కాల్పులు జరుపుతున్నట్లు కనిపించింది.