వాషింగ్టన్, జూలై 8 : భారత్లో ఉన్న ప్రియురాలి కోసం అమెరికాలో ఉంటున్న ఒక తెలంగాణ టెకీ దారుణానికి ఒడిగట్టాడు. భార్యను గొంతు పిసికి హత్య చేసి అపరిచిత వ్యక్తి ఎవరో హత్య చేసినట్టు నమ్మించడానికి ప్రయత్నించాడు. దీనిపై సుదీర్ఘ కాలం పాటు దర్యాప్తు చేసిన యూఎస్ పోలీసులు తొమ్మిది నెలల తర్వాత అతడే ఈ హత్య చేసినట్టు నిర్ధారించి అరెస్ట్ చేశారు. తెలంగాణకు చెందిన 30 ఏండ్ల అవినాష్ నార్నే, 27 ఏండ్ల రాజితా సబ్బినేని దంపతులు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తూ వాషింగ్టన్లో నివసిస్తున్నారు. అయితే గత ఏడాది అక్టోబర్లో తన భార్య బాత్రూమ్ లోపల తలుపు వేసుకుని ఉందని, ఎంత కొట్టినా తీయడం లేదంటూ బెల్లెవ్యూ పోలీసులకు అవినాష్ ఫోన్ చేశాడు. పోలీసులు అతని ఇంటికి చేరుకుని బాత్రూమ్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా రాజితా నిర్జీవంగా నేలపై పడి ఉంది.
గొంతుపిసకడం వల్లే ఆమె మరణించిందని పేర్కొన్న పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అప్పటికీ అవినాష్ దంపతులకు పెండ్లయ్యి ఆరు నెలలు మాత్రమే అయ్యింది. తాను ఆ సమయంలో బయటకు వెళ్లానని అవినాష్ పోలీసులను నమ్మించాడు. పోలీసులకు అతనిపై అనుమానం ఉన్నా ఆధారాలు లేకపోవడంతో, అతడు స్వేచ్ఛగా అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. దీనిపై తొమ్మిది నెలల పాటు దర్యాప్తు జరిపిన పోలీసులు అవినాషే తన భార్యను చంపినట్టు డిజిటల్ ఆధారాలు సేకరించారు. నార్నేకు పెండ్లికి ముందే భారత్లోని ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉందని, వివాహం తర్వాత కూడా వారి సంబంధం కొనసాగిందని, అతని భార్య హత్యకు అదే కారణం కావచ్చునని నిర్ధారించారు. సబ్బినేని మరణించిన రోజు కూడా అతడు ప్రియురాలికి నాలుగుసార్లు ఫోన్ చేశాడు. హత్య జరిగిన ఒక రోజు తర్వాత భార్య మృతదేహం ఫొటోను ప్రియురాలికి పంపినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో అవినాష్ తాను చేసిన నేరాన్ని అంగీకరించాడని అధికారులు తెలిపారు.