కేశంపేట, మార్చి 5: ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లిన మరో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. దుండుగుడొకరు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని కేశంపేట మండలానికి చెందిన ప్రవీణ్ (27) ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు. విస్కాన్సిన్ మిల్వాంకిలో ఇంటికి సమీపంలోని బీచ్లో ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రవీణ్ మృతి గురించి అతడి స్నేహితులు భారత్లోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఒక్కగానొక్క కుమారుడు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రవీణ్ మృతితో కేశంపేట మండల కేంద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.