Iran vs US : అమెరికా (USA) తో జరగాల్సిన రెండో విడత చర్చల్లో పాల్గొనడంపై ఇప్పటివరకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సోమవారం ఇరాన్ (Iran) స్పష్టంచేసింది. వాషింగ్టన్ నుంచి వైరుధ్యపూరిత చర్యలు ఎదురవుతున్నాయని, ఈ నేపథ్యంలోనే ఈ వైఖరి తీసుకున్నట్లు తెలిపింది. టెహ్రాన్‌లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బాఘేయి (Ismail Bgheyi) ఈ విషయాలు వెల్లడించారు. తదుపరి చర్చల గురించి తాము ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని ఆయన స్పష్టంగా చెప్పారు.
దౌత్య మార్గాన్ని అనుసరిస్తున్నామని చెబుతూనే అమెరికా ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తోందని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి విమర్శించారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభం నుంచే అమెరికా నుంచి తమకు వ్యతిరేకత ఫిర్యాదులు ఎదురయ్యాయని బాఘేయి పేర్కొన్నారు. తాజాగా ఆదివారం రాత్రి హర్మూజ్ జలసంధిలో ఇరాన్ వాణిజ్య నౌకపై అమెరికా దాడి చేసిందని, ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని, దురాక్రమణ చర్య అని ఆరోపించారు. కాగా అమెరికా దిగ్బంధనాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇరాన్ కార్గో షిప్‌ను అడ్డగించి, స్వాధీనం చేసుకున్నామని ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ విషయాన్ని బఘేయి ప్రస్తావిస్తూ.. అమెరికా చర్యల్లోని ఈ అస్థిరత, చర్చల ప్రక్రియపై తమకున్న అపనమ్మకాన్ని మరింత పెంచుతోందని అన్నారు. గతంలో అమెరికా రెండుసార్లు దౌత్యానికి ద్రోహం చేసిందని, తమ సార్వభౌమత్వంపై దాడి చేసిందని గుర్తుచేశారు. ఈ అనుభవాలను విస్మరించలేమని, జాతీయ ప్రయోజనాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే భవిష్యత్ మార్గంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. మంగళవారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో చర్చలు ఉంటాయని ట్రంప్ చెబుతున్న నేపథ్యంలో.. ఇరాన్ తాజా ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.