ట్యూనిస్: 750 టన్నుల డీజిల్‌ను రవాణా చేస్తున్న ట్యాంకర్ నౌక ట్యునీషియా తీరంలో సముద్రంలో మునిపోయింది. దీంతో చమురు తెట్టుపై ఆందోళనలు నెలకొన్నాయి. గినియాకు చెందిన జెలో ట్యాంకర్ ఈజిప్టులోని డామిట్టా పోర్ట్ నుంచి ఐరోపాలోని మాల్టా దీవికి 750 టన్నుల డీజిల్‌తో వెళ్తున్నది. అయితే శుక్రవారం సాయంత్రం ప్రతికూల వాతావరణం తలెత్తింది. ఈ నేపథ్యంలో ట్యునీషియా జలాల్లోకి ప్రవేశం కోసం ఆ ట్యాంకర్ సిబ్బంది అనుమతి కోరారు.
మరోవైపు ట్యునీషియా ఆగ్నేయ తీరంలోని గల్ఫ్ ఆఫ్ గేబ్స్లో ఆ డీజిల్ ట్యాంకర్ శనివారం ముగినిపోయింది. ట్యునీషియా సముద్ర జల్లాల్లో ఇది మునిగినట్లు ఆ దేశ ప్రతినిధి తెలిపారు. అందులోని ఏడుగురు సిబ్బందిని రక్షించినట్లు చెప్పారు. వైద్య పరీక్షల అనంతరం వారికి అతిథ్యమిచ్చినట్లు వివరించారు. కాగా, ప్రస్తుతం ఆ ట్యాంకర్ నౌక నుంచి ఎలాంటి లీకేజీ లేదని పేర్కొన్నారు. డీజిల్ ట్యాంకర్ మునిగిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ట్యునీషియా విపత్తు నివారణ కమిటీ సమావేశమవుతుందని వెల్లడించారు.