ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే వున్నాయి. నేటికి సరిగ్గా 13 రోజులు. రాజధానితో సహా పలు ప్రాంతాలపై ఏక ధాటిగా రష్యా బలగాలు కాల్పులు జరుపుతూనే వున్నాయి. ఈ నేపథ్యంలో రష్యాపై పోరులో విదేశీ వాలంటీర్లు తమకు సహకరించాలంటూ, వాలంటరీగా ముందుకు రావాలంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ పిలుపు మేరకు తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఉక్రెయిన్ సైన్యంలో చేరాడు. ఉక్రెయిన్ మీడియా రిపోర్టుల ప్రకారం కోయంబత్తూరుకు చెందిన సైనికేశ్ రవిచంద్రన్ (21) ఉక్రెయిన్ పారామిలటరీ సైన్యంలో చేరినట్లు పేర్కొంది. అంతేకాకుండా ఖార్కివ్‌లోని ఏవియేషన్ ఇనిస్టిట్యూట్‌లో ట్రైనింగ్ కూడా తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశాడు. అయితే ఈ విషయంపై భారత ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకూ స్పందించలేదు.
ఇక మరిన్ని దేశాలకు చెందిన పౌరులు కూడా రష్యాను వ్యతిరేకిస్తూ.. ఉక్రెయిన్ ఆర్మీలో చేరడానికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారని అధికారులు ప్రకటించారు. అమెరికా, యూకే, స్వీడన్, లుథియానా, మెక్సికో దేశాలకు చెందిన పౌరులు ఉక్రెయిన్‌కు మద్దతుగా సైన్యంలో చేరుతున్నారు. అలాగే జార్జియా, బెలారస్‌కు చెందిన పౌరులు కూడా రష్యాను వ్యతిరేకిస్తూ ఉక్రెయిన్ ఆర్మీల చేరుతున్నారు.