కాబూల్: ఒకటీ, రెండుళ్లు కాదు. ఏకంగా రెండు దశాబ్దాలు ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తమ బలగాలను మోహరించింది అమెరికా. బిన్ లాడెన్‌ను వెతుక్కుంటూ వచ్చి.. అతనికి ఆశ్రయమిచ్చిన తాలిబన్లను ఏరేసి ఆ దేశాన్ని ఉద్ధరిస్తామని చెప్పిన అగ్రరాజ్యం ఇప్పుడు పెట్టాబేడా సర్దుకొని దేశం వీడింది. ఇన్నాళ్లూ ఏ లక్ష్యం కోసం పనిచేసిందో.. ఇప్పుడది కళ్ల ముందే నీరుగారిపోతున్నా.. ఏమీ పట్టనట్లు చోద్యం చూస్తోంది. తమను తాము రక్షించుకునేలా ఆఫ్ఘన్ సైన్యాన్ని సిద్ధం చేశామని చెప్పుకున్నా.. ఇప్పుడు అగ్రరాజ్య వైఫల్యాన్ని ప్రపంచానికి కళ్లకు కట్టినట్లు చూపించారు తాలిబన్లు. 20 ఏళ్ల తర్వాత మరోసారి ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
నెల రోజులు కూడా పోరాడలేక..
8900 కోట్ల డాలర్లు (సుమారు రూ.6.6 లక్షల కోట్లు).. ఇదీ ఆఫ్ఘనిస్థాన్ ఆర్మీకి అత్యాధునిక శిక్షణ ఇవ్వడానికి అమెరికా చేసిన ఖర్చు. రెండు దశాబ్దాల పాటు ప్రపంచంలోనే మేటి ఆర్మీగా పేరున్న అమెరికా.. ఆఫ్ఘన్ సైన్యానికి శిక్షణ ఇస్తోంది. కానీ అలాంటి ఆర్మీని నెల రోజుల్లోపే సునాయాసంగా మట్టి కరిపించారు తాలిబన్లు. ఒక్కో నగరాన్ని హస్తగతం చేసుకుంటూ.. మొత్తం దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే పట్టింది. తమ సైన్యం వీరోచితంగా పోరాడిదంటూ ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ ప్రశంసించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి.
చాలా చోట్ల ఆఫ్ఘన్ శ్రేణులు కనీస పోరాటం కూడా లేకుండా తాలిబన్లకు లొంగిపోయారు. కొన్ని చోట్ల తాలిబన్లు రాక ముందే తమ పోస్టులు వదిలి పారిపోయారు. మరికొన్ని చోట్ల వాళ్లతో పోరాడలేక శాంతి ఒప్పందాలు చేసుకొని తమ ఆయుధాలను అప్పగించేశారు. కొన్ని ప్రావిన్స్‌ల గవర్నర్లే.. తమ భద్రతా సిబ్బందికి లొంగిపోవాలని ఆదేశించినట్లు అమెరికా అధికారులు చెబుతున్నారు.
అవినీతిలో మునిగి తేలుతూ..
ఆఫ్ఘనిస్థాన్ మిలిటరీ, రాజకీయ నాయకత్వం అవినీతిలో కూరుకుపోవడం కూడా అక్కడి సైన్యాన్ని బలహీనం చేసింది. తమ సైనికులను సరిగా పట్టించుకోకుండా కొన్నేళ్ల పాటు అవుట్‌పోస్ట్‌లలో వదిలేశారు. అలాంటి ఎంతో మంది శిక్షణ పొందిన సైనికులు.. మెల్లగా తాలిబన్ల వైపు ఆకర్షితులయ్యారు. ఇక కొన్నేళ్లుగా ప్రతి నెలా వందల మంది ఆఫ్ఘన్ సైనికులు మృత్యువాత పడుతున్నా.. అక్కడి ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరించింది. అమెరికాతోపాటు ఇతర అంతర్జాతీయ బలగాల అండ ఉన్నంత వరకూ బయటి ప్రపంచానికి ఏమీ తెలియలేదు. ఒక్కసారి వాళ్లు దేశాన్ని వీడటం ప్రారంభమైన తర్వాత అమెరికా నిర్మించిన పేక మేడ క్షణాల్లో కూలిపోయింది.
అగ్రరాజ్య వైఫల్యమే..
ఆఫ్ఘనిస్థాన్‌లో 3 లక్షల మంది సుశిక్షుతులైన సైనికులు ఉన్నారు. వాళ్ల దేశాన్ని వాళ్లు కాపాడుకునే సత్తా వారికి ఉంది అని అమెరికా చెబుతూ వచ్చింది. కానీ వాస్తవం మాత్రం మరోలా ఉంది. దీనికితోడు భద్రతా దళాలు వెనుకడుగు వేసిన కొద్దీ స్థానిక మిలీషియాలు అప్పటికప్పుడు బలోపేతమై.. తాలిబన్లకు మద్దతుగా పోరాటంలో పాల్గొన్నాయి. అసలు ఆఫ్ఘన్ సైన్యాన్ని పాశ్చాత్య దేశాల బలగాల స్థాయిలో తీర్చిదిద్దాలన్న అమెరికా లక్ష్యమే అతి పెద్ద తప్పిదం. ప్రపంచంలోని నిరుపేద దేశాల్లో ఒకటి, కనీసం 40 శాతం అక్షరాస్యత లేని ఆఫ్ఘనిస్థాన్.. ఆ స్థాయికి చాలా దూరంలోనే నిలిచిపోయింది.
అమెరికన్ ఆర్మీకి చెందిన శిక్షకులు ఆఫ్ఘన్ బలగాలకు ఆర్మీలోని ప్రాథమిక పాఠాలు చెప్పడానికీ ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఆ దేశంలోని చాలా మంది యువత ఓ ఉద్యోగంలా భావించి ఆర్మీలోకి వచ్చారు తప్ప.. ఎవరూ దీనిని సీరియస్‌గా తీసుకోలేదని ఓ అమెరికా అధికారి చెప్పడం గమనార్హం.