PAK vs AFG : పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ (PAK vs AFG) దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఇక తెరపడింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం కుదరడానికి ముందు పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ల దేశాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంలో అఫ్గానిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మహమ్మద్ నబీ ఒమారి (Muhammad Nabi Omari) పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు చేశారు.
ప్రత్యర్థి ఎలాంటి ఆక్రమణకు పాల్పడినా తమ దళాలు వారిని భారత సరిహద్దు వరకు పరిగెత్తిస్తాయని ఒమారి వ్యాఖ్యానించారు. ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఒమారి ఈ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పాక్టికా ప్రావిన్స్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడి పౌరుల ప్రాణాలు తీయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆ దేశంలోని సైనిక నాయకత్వాన్ని విమర్శించారు.
ఆ దేశ సైనిక పాలన ఇతరుల ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని ఒమారి విమర్శించారు. ఇటీవల ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సానుభూతిపరుడిలా మాట్లాడిన వీడియోల గురించి ఆయన ప్రస్తావించారు. కొన్ని రోజులుగా అఫ్గాన్-పాక్ సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం నెలకొంది.
తొలుత అనుకున్న 48 గంటల కాల్పుల విరమణ పూర్తైన వెంటనే అఫ్గాన్‌పై పాకిస్థాన్ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ ఘటనలో ముగ్గురు యువ క్రికెటర్లతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని అఫ్గాన్ తీవ్రంగా ఖండించింది. మరోవైపు ఖతార్ రాజధాని దోహాలో ఇరుదేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయి. తక్షణ కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ శాఖ ప్రకటించింది.