కాబూల్ : ప్రపంచంలోనే అతిపెద్ద ఒపియం ఉత్పత్తిదారు ఆఫ్ఘనిస్తాన్. ఆ దేశంలో తాలిబన్ సర్కారు ఆదివారం ఒపియం సాగుపై నిషేధం విధించింది. హెరాయిన్ వంటి నిషేధిత మాదకద్రవ్యాల తయారీకి ఒపియంను ముడిసరుకుగా ఉపయోగిస్తుంటారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ సుప్రీం లీడర్
హైబతుల్లా అఖుంద్జాదా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు.. ఇకపై దేశవ్యాప్తంగా ఒపియం సాగుపై కఠిన నిషేధం అమలులో ఉంటుంది. పంటను సాగు చేస్తే వారికి జైలు తప్పదని, పంటను సైతం తగులబెట్టనున్నట్లు తాలిబాన్ ప్రతినిధి తెలిపారు.
ఇదే సమయంలో హెరాయిన్, హషిష్, మద్యం వ్యాపారంపై బ్యాన్‌ను విధించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఒపియం సాగు ముఖ్యమైన ఉపాధి, ఆదాయ వనరు. లక్షలాది మంది రైతులు ఒపియం సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. గతేడాది ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతర్జాతీయ గుర్తింపు ప్రయత్నాలు చేస్తున్నది. తమపై విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతున్నది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం తాలిబన్ సర్కారు ముందుంచిన ప్రధాన డిమాండ్లలో ఒపియం సాగుపై నిషేధం ఒకటి. తాలిబాన్ ప్రభుత్వంపై విధించిన ఆంక్షలు ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాంకింగ్ వ్యవస్థ, వ్యాపార అభివృద్ధికి ఆటంకంగా మారాయి.
ఒపియం సాగుపై నిషేధం విధించిన క్రమంలో ఉప ప్రధానమంత్రి అబ్దుల్ సలామ్ హనాపీ రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధిని చూపేందుకు అంతర్జాతీయ దాతల నుంచి సహకారం కోరినట్లు ఆఫ్ఘన్ మీడియా టోలో న్యూస్ పేర్కొంది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ ప్రకారం.. ఒపియం ఉత్పత్తుల సరఫరాలో 80 శాతం కంటే ఎక్కువ ఉత్పత్తితో ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. యూఎన్ డేటా ప్రకారం.. ఆఫ్ఘన్ ఒపియం ఉత్పతుల నుంచి 1.8 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నది.