ఒట్టావా: కెనడాలోని బ్రాంప్టన్లో హిందూ దేవాలయాలపై దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఖలిస్థానీ (Khalistan) వేర్పాటువాదులకు మద్దతు పలుకుతూ ఆలయాలపై దాడికి పాల్పడ్డ వారిపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఓ పోలీస్ అధికారిపై వేటు వేసింది. పీల్ రీజినల్ పోలీసు అధికారి అయిన హరీందర్ సోహీపై.. ఖలిస్థానీ జెండాతో ఆందోళనలో పాల్గొన్నారు. ఖలిస్థాన్కి మద్దతుగా, భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ వీడియోలు వైరల్గా మారాయి. దీంతో కెనడా పోలీస్ శాఖ సోహీని సస్పెండ్ చేసింది. కెనడా కమ్యూనిటీ సేఫ్టీ, పోలీసింగ్ యాక్ట్ నిబంధనల్ని ఉల్లంఘించడంతో హరీందర్పై చర్యలు తీసుకున్నట్లు మీడియా రిలేషన్స్ ఆఫీసర్ రిచర్డ్ చిన్ తెలిపారు.
ఖలిస్థాన్ జెండాలు చేతబూని.. ఆలయం వద్ద జరుగుతున్న హిందువుల సభపైకి దూసుకెళ్లారు. అందర్నీ భయభ్రాంతులకు గురిచేస్తూ.. సభకు హాజరైన హిందూ భక్తులపై దాడి చేసి ఇష్టమొచ్చినట్టు కొట్టారు. మహిళలను, పిల్లలను సైతం వేర్పాటువాదులు వదల్లేదని ‘హిందూ కెనడియన్ ఫౌండేషన్’ పేర్కొన్నది. కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులతోనే ఇదంతా జరుగుతున్నదని ఆరోపించింది. ఈ ఘటన కెనడాలో తీవ్ర కలకలం రేపింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా వివిధ రాజకీయ నాయకులు ఘటనను ఖండించారు. దాడికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షిస్తామని బ్రాంప్టన్ మేయర్ ప్యాట్రిక్ బ్రౌన్ ప్రకటించారు. భక్తులపై దాడికి తెగబడటాన్ని కెనడా విపక్ష నేత పియెర్రి పొలివ్రీ తీవ్రంగా ఖండించారు.
హిందువులకు భద్రత కల్పించటంలో కెనడా ప్రభుత్వం విఫలమైందని టొరొంటో ఎంపీ కెవిన్ వోంగ్ అన్నారు. ‘బ్రాంప్టన్ దాడి ఎంతమాత్రమూ ఆమోదనీయం కాదు. కెనడాలోని ప్రతి పౌరుడూ స్వేచ్ఛగా, సురక్షితంగా తన మత విశ్వాసాల్ని పాటించే హక్కు ఉంది’ అని ప్రధా ని జస్టిన్ ట్రూడో ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. హిందువులపై దాడిని కెనడా ఎంపీ చంద్ర ఆర్య తీవ్రంగా ఖండించారు. ఖలిస్థాన్ వేర్పాటువాదులు రెడ్ లైన్ దాటారని అన్నారు. ‘ఖలిస్థాన్ వేర్పాటువాదుల తీవ్రవాదం కెనడాలో ఎంత నిస్సిగ్గుగా మారిందో తాజా ఘటన చూపుతున్నది. చట్టాల్ని అమలుజేసే ఏజెన్సీల్లో ఖలిస్థానీలు చొరబడ్డారన్న నివేదికల్లో నిజం ఉంది’ అని అన్నారు.