న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం సూడాన్ (Sudan) లో సైన్యానికి, శక్తిమంతమైన పారా మిలిటరీ దళాలకు మధ్య ఘర్షణలు (Clashes) ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో ఈ ఘర్షణల్లో మరణించే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. శనివారం రాత్రి మొదలైన ఘర్షణలు ఇంకా సద్దుమణగలేదు. ఇప్పటికే ఈ ఘర్షణల్లో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 600 మందికిపైగా గాయాలపాలయ్యారు.
రాజధాని ఖార్తూమ్ (Khartoum) సహా వివిధ ప్రాంతాల్లో ఇరు సాయుధ బలగాల మధ్య పోరు ముమ్మరంగా సాగుతోంది. దాంతో అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఆశలకు ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. ఘర్షణలు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘర్షణలకు కారణం ఏందంటే.. 2021 అక్టోబర్‌లో సైనిక తిరుగుబాటుతో సూడాన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం కుప్పకూలింది. ఈ సైనిక తిరుగుబాటులో సైన్యంతోపాటు పారామిలిటరీ కూడా పాల్గొంది.
అయితే, ప్రభుత్వాన్ని కూలదోసిన అనంతరం పారామిలిటరీ గ్రూప్ ‘శీఘ్ర మద్దతు దళం’ (ఆర్ఎస్ఎఫ్)తో సైన్యానికి విభేదాలు పెరిగాయి. దాంతో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కాగా దేశంలో మునుపటి పరిస్థితిని పునరుద్ధరించడానికి రాజకీయ పార్టీలతో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు మొదలైనా, ఉద్రిక్తతల నడుమ అవి ఆగిపోయాయి.
యుద్ధవిమానాలు, మెషిన్ గన్లు అమర్చిన ట్రక్కులు సహా సాయుధ వాహనాలతో జనసమ్మర్ద ప్రాంతాలపై కాల్పులు జరుపుతుండడంతో సూడాన్‌లో ఎక్కడ చూసినా భీతావహ దృశ్యాలే కనిపిస్తున్నాయి. కాగా, మానవతా దృక్పథంతో పౌరుల అవసరాల కోసం మాత్రం ఆదివారం సుమారు మూడు గంటలసేపు కాల్పుల విరమణ పాటించారు.