Stress | న్యూయార్క్, సెప్టెంబర్ 12: ఒత్తిడి వల్ల శుక్రకణాలు చలనశీలతను కోల్పోతాయని ఇప్పటివరకు చదువుకున్నాం. పునరుత్పత్తి వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలుసు. కానీ, ఒత్తిడిని జయించిన తర్వాత శుక్రకణాల్లో వేగం పెరుగుతుందని, పునరుత్పత్తి వ్యవస్థలో అండంతో ఫలదీకరణం ఆశాజనకంగా జరుగుతుందని తాజా అధ్యయనం తేల్చింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో అన్స్చుట్జ్ మెడికల్ క్యాంపస్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో.. ఒత్తిడిని జయించిన తర్వాత శుక్రకణాల చలనం ఆరోగ్యవంతంగా ఉన్నట్టు తెలిసింది. దాని ఫలితంగా జననాల రేటులో వృద్ధి కనిపించిందని పరిశోధకులు వివరించారు.
అల్సర్, గ్యాస్ట్రిక్ సహా జీర్ణక్రియ సంబంధ సమస్యలతో వణుకుడు రోగం 76 శాతం పెరిగే అవకాశం ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. 9,350 మంది పేషెంట్లపై చేసిన పరిశోధనల్లో.. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడినవారు వృద్ధాప్యం వచ్చేసరికి వణుకుడు సమస్యలతో బాధపడినట్టు తమ అధ్యయనంలో తేలిందని అమెరికాలోని బెత్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు తెలిపారు. మలబద్ధకం, కడుపు నిండుగా అనిపించటం లాంటి సమస్యలు తలెత్తి.. పార్కిన్సన్కు దారితీస్తాయని వెల్లడించారు. వృద్ధుల్లో పార్కిన్సన్ ఎక్కువగా కనిపించడానికి జీర్ణ సంబంధిత సమస్యలే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.