న్యూయార్క్: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్(Stormy Daniels) దాఖలు చేసిన పరువునష్టం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) విక్టరీ సాధించారు. ట్రంప్ లీగల్ బృందానికి లక్షా 21 వేల డాలర్లు చెల్లించాలంటూ ఆ కేసులో డేనియల్స్‌కు కాలిఫోర్నియా సర్క్యూట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే మరో కేసులో ట్రంప్ లాయర్లకు ఆ పోర్న్ స్టార్ సుమారు 5 లక్షల డాలర్లు చెల్లిస్తోంది. హష్ మనీ కేసులో మన్‌హట్టన్ కోర్టు ఆదేశాలు ఇచ్చిన రోజునే కాలిఫోర్నియా కోర్టు పోర్న్ స్టార్ కేసును కొట్టివేసింది. ట్రంప్ లాయర్ హర్మీత్ దిల్లాన్ తన ట్విట్టర్లో కోర్టు ఆదేశాల కాపీని షేర్ చేశారు.
గతంలో పోర్న్ స్టార్ డేనియల్స్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ 2018లో ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ విషయంలో పరువునష్టం కేసు(defamation case)ను డేనియల్స్ నమోదు చేశారు. అయితే కోర్టు విచారణలో.. ట్రంప్‌కు అనుకూలంగా జడ్జి ఆదేశాలు జారీ చేశారు. లీగల్ ఫీజుల కింద ట్రంప్ టీమ్‌కు రెండు లక్షల 93 వేల డాలర్లు చెల్లించాలని డేనియల్స్‌కు జడ్జి ఒటెరో ఆదేశించారు.