లండన్, మే 21: భారత్కు చెందిన ఒక బడా బియ్యం వ్యాపారి అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఇచ్చిన విరాళాన్ని నిలుపుదల చేయాలని విపక్ష లేబర్ పార్టీ బ్రిటన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బియ్యం వ్యాపారి కరన్ చనన పలు షెల్ కంపెనీల ద్వారా హవాలా కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై ఆ దేశానికి చెందిన ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్నారని లేబర్ పార్టీ ఎంపీ, అవినితి నిరోధకంపై ఏర్పాటైన ఆల్ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ చైర్మన్ మార్గరేట్ హాడ్గే ఆరోపించారు. అంతేకాకుండా ఆయన పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తన అక్రమ కంపెనీలకు తరలించారన్నారు. తన బ్రిటీష్ కంపెనీ అమిరా జి. ఫుడ్స్ ద్వారా 2019 నుంచి ఆయన కన్జర్వేటివ్ పార్టీకి సుమారు 220,00 జీబీపీలు (ఒక జీబీపీ అంటే సుమారు 103 రూపాయలు) విరాళంగా ఇచ్చినట్టు తెలిసిందన్నారు. ఈ విషయంలో దర్యాప్తు కొనసాగుతున్నందున ఆయనపై ఇంకా కేసు నమోదు చేయలేదని ఈడీ తెలిపిందన్నారు. ఈ నేపథ్యంలో విచారణ పూర్తయ్యే వరకు ఆయన ఇచ్చిన నిధులను కన్జర్వేటివ్ పార్టీ స్తంభింపచేయాలని ఆమె డిమాండ్ చేశారు.