Starbucks | యూఎస్ కాఫీ చైన్ స్టార్బక్స్ (Starbucks)కు భారీ షాక్ తగిలింది. తనపై జాతి వివక్ష చూపించారంటూ ఓ ఉద్యోగిని వేసిన కేసులో ఫెడరల్ జ్యూరీ స్టార్ బక్స్ కు షాక్ ఇచ్చింది. ఆ ఉద్యోగికి 25.6 మిలియన్ల డాలర్లు చెల్లించాలంటూ ఆదేశించింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. రూ.210 కోట్లన్నమాట.
వివరాల్లోకి వెళితే.. 2018లో ఫిలడెల్ఫియాలోని స్టార్ బక్స్ స్టోర్ కు ఇద్దరు నల్లజాతీయులు వచ్చారు. కాసేపటికి వారు వాష్ రూమ్స్ ను వినియోగించుకుంటామని అక్కడి సిబ్బందిని కోరారు. వారు స్టోర్ లో ఏమీ కొనుగోలు చేయకపోవడంతో సిబ్బంది అందుకు నిరాకరించింది. అయితే, తాము వ్యాపారం పనిమీద మరో వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. దీంతో ఆగ్రహించిన స్టోర్ సిబ్బంది వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ వారికి సూచించారు. అందుకు వారు ససేమిరా అన్నారు. ఏం చేయాలో తెలియక స్టోర్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి చేరుకున్న స్థానిక పోలీసులు ఆ ఇద్దరినీ బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఈ వ్యవహారమంతా అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు కావడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. దీంతో ఈ ఘటన నిరసనలకు దారితీసింది. కంపెనీ తన దుకాణాలన్నింటినీ మూసేవరకూ వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన సంస్థ పరిస్థితిని సద్దుమణిగేలా చేసేందుకు చర్యలు ప్రారంభించింది.
ఇందులో భాగంగానే దుకాణంలో 13 ఏళ్లుగా పనిచేస్తున్న రీజినల్ మేనేజర్ అయిన షానన్ ఫిలిప్స్ (Shannon Phillips)ను ఉద్యోగం నుంచి తొలగించింది. అయితే దుకాణ మేనేజర్ ను మాత్రం విధుల్లోనే కొనసాగించింది. ఉద్యోగం కోల్పోయిన రీజినల్ మేనేజర్ శ్వేత జాతీయురాలు కాగా, మేనేజర్ నల్ల జాతీయుడు కావడం గమనార్హం.
ఈ ఘటనలో ఏ తప్పూ లేకుండానే తనను తొలగించారని షానన్ ఫిలిప్స్ ఆవేదన వ్యక్తం చేసింది. శ్వేతజాతీయురాలినైన తనపై జాతి వివక్ష చూపించి ఉద్యోగం నుంచి తొలగించారంటూ 2019లో స్టార్ బక్స్ పై దావా వేసింది. ఘటనపై చర్యల పేరుతో ఫిలిప్స్ ను బలిపశువును చేశారంటూ ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యూజెర్సీ (New Jersey) లోని ఫెడరల్ జ్యూరీ ( federal jury).. స్టార్ బక్స్ సంస్థకు 25.6 మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.
Also Read..
Cyclone Biparjoy | రాజస్థాన్ కు భారీ వర్ష సూచన.. ఆరెంజ్ అలర్జ్ జారీ చేసిన ఐఎండీ
Upasana | నేను ప్రెగ్నెంట్ అని తెలియగానే చరణ్ అలా స్పందించాడు : ఉపాసన
Cyclone Biparjoy | విషాదం.. మేకల్ని రక్షించేందుకు వెళ్లి తండ్రి, కుమారుడు మృతి