కొలంబో: ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ్సింఘేను శుక్రవారం అరెస్ట్ చేశారు. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2023 సెప్టెంబర్లో ఆయన లండన్ పర్యటనలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్టు వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించిన అనంతరం అధికారులు ఆయనను అరెస్ట్ చేశారు.
ఆయనను కొలంబో ఫోర్ట్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరుస్తారు. బ్రిటిష్ యూనివర్సిటీలో తన భార్యను సత్కరించే కార్యక్రమానికి దేశ నిధులు దుర్వినియోగం చేసినట్టు ఆయనపై ఆరోపణలు నమోదయ్యాయి. ఆ కార్యక్రమానికి హాజరైన సింఘే ప్రయాణ, బాడీగార్డు ఖర్చులకు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అధికారులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను రణిల్ ఖండించారు.