Sperm Donation | లండన్: సంతానలేమితో బాధపడే వారికి సంతానం కలిగించే వీర్యదాన ప్రక్రియ బ్రిటన్లో అదుపు తప్పింది. బ్రిటన్ నుంచి విదేశాలకు వీర్యం ఎగుమతి అవుతున్నది. బ్రిటన్లోని నిబంధనల ప్రకారం ఒకరి వీర్యం పది కుటుంబాలకు మించి ఇవ్వడానికి వీలు లేదు. అయితే, ఎగుమతుల విషయంలో మాత్రం నిర్దిష్ట పరిమితి లేదు. బ్రిటన్ చట్టాల్లోని ఈ లోపాలను ఆసరాగా చేసుకొని వీర్యదానాన్ని పారిశ్రామిక స్థాయిలో చేపడుతున్నారట.
దీంతో కొందరికి బ్రిటన్లో, విదేశాల్లో ఒక్కొక్కరికి డజన్ల కొద్ది తోబుట్టువులు ఉండే అవకాశం ఉందని తాజాగా ఓ నివేదిక పేర్కొన్నది. ఈ మేరకు ‘గార్డియన్’ వార్తాపత్రికలో ఒక కథనం ప్రచురితమైంది. దీని ప్రకారం.. గతంలో బ్రిటన్కు అమెరికా, డెన్మార్క్ వంటి దేశాల నుంచి వీర్యం, అండాలు దిగుమతి అయ్యేవి. తర్వాత పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. 2019 నుంచి 2021 మధ్యనే యూకే నుంచి విదేశాలకు 7,542 స్ట్రాల వీర్యం ఎగుమతి అయ్యింది.