బార్సిలోనా, అక్టోబర్ 30 : యూరప్ దేశం స్పెయిన్ ప్రకృతి ప్రకోపానికి గురైంది. ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో భారీ వర్షాలు, వరదలు ఆ దేశ తూర్పు, దక్షిణ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అనేక గ్రామాలు నదులను తలపిస్తున్నాయి. రెండు రోజులుగా ప్రజలు ఇండ్లల్లో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తున్నది. పలు పట్టణాలు, గ్రామాల్లో వరద ధాటికి కార్లు, పెద్ద పెద్ద కంటైనర్లు సైతం కొట్టుకుపోయాయి. వివిధ చోట్ల జరిగిన ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య బుధవారం నాటికి 72కు చేరుకుందని, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని అత్యవసర సేవల విభాగం వెల్లడించింది. అనేక పట్టణాల్ని వరద నీరు ముంచెత్తిందని, ప్రమాదం అంచున ఉన్నాయని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తెలిపారు. ‘ఎలుకల మాదిరి మేమంతా ఇండ్లల్లో చిక్కుకుపోయాం. వీధుల్లో నీరు మూడు మీటర్ల ఎత్తుకు చేరుకుంది’ అని వాలెన్సియా పట్టణ మేయర్ రికార్డో గాబ్లడాన్ చెప్పారు.