South Korea | అమెరికా మిత్రపక్షం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోయల్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో అత్యవసర సైనిక పాలన విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కొరియా పట్ల సానుభూతి ప్రదర్శిస్తూ విపక్ష పార్టీలు పరిపాలనకు అడ్డం పడుతున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన టీవీ చానెల్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగిస్తూ ఈ ఆదేశాలు జారీ చేశారు. దీంతో దేశంలో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
‘ఉత్తర కొరియా కమ్యూనిస్టు బలగాల నుంచి ముప్పును నివారించి స్వేచ్ఛాయుత దక్షిణ కొరియా రక్షణ కోసం, సంఘ వ్యతిరేక శక్తులను తుదముట్టించడానికి అత్యవసర సైనిక పాలన విధిస్తున్నాను’ అని ప్రకటించారు. దేశ స్వేచ్చాయుత, రాజ్యాంగ పరమైన ఆదేశాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని పిలుపునిచ్చారు.