South Korea Air drill | ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఇరుదేశాలు తమ తమ శక్తిని ప్రదర్శించుకుంటున్నాయి. శనివారం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (Ballistic Missile) ని ఉత్తర కొరియా ప్రయోగించింది. దానికి ప్రతిస్పందనగా అమెరికాతో దక్షిణ కొరియా వైమానిక విన్యాసాలకు పూనుకున్నది. అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ బాంబర్ (strategic bomber) తో కూడిన ఎయిర్ డ్రిల్ (Air Drill) ను ఆదివారం నిర్వహించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది.
దక్షిణ కొరియా-అమెరికాలు నిర్వహించబోయే సైనిక కసరత్తులపై ఇప్పటికే ఉత్తర కొరియా స్పందించింది. అలాంటి విన్యాసాలు జరిపితే చర్యలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించింది. తన బలం తెలియజేయడంలో భాగంగా ఉత్తర కొరియా మరోసారి శనివారం మధ్యాహ్నం జపాన్ పశ్చిమ తీరంలో సముద్రంలోకి లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్-15 (ICBM) ను ప్రయోగించింది. దీనికి స్పందించిన దక్షిణ కొరియా ఆదివారం ఉదయం అమెరికాతో కలిసి సంయుక్త వైమానిక విన్యాసాలను చేపట్టింది. ఇందులో అమెరికాకు చెందిన స్ట్రాటజిక్ బాంబర్ విమానాలు కూడా పాల్గొన్నాయని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.
ఈ వైమానిక విన్యాసాల్లో అమెరికా ఎయిర్ ఫోర్స్ (US airforce) బీ-1బీ బాంబర్లు, సెంటర్, పీ-22 ఫైటర్ జెట్లు, దక్షిణ కొరియా వైమానిక దళంకు చెందిన పీ-35 ఫైటర్ జెట్లు పాల్గొన్నాయి. కాగా, ఆదివారం మధ్యాహ్నం జపాన్ – యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా ఎయిర్ డ్రిల్ నిర్వహించే అవకాశం ఉన్నదని జపాన్ (Japan) కు చెందిన ఫుజి న్యూస్ నెట్వర్క్ వెల్లడించింది. తమ దేశానికి కూడా నష్టం కలిగించేలా ఉత్తర కొరియా వ్యవహరిస్తున్నదని జపాన్ భయంతో ఉన్నది. దాంతో అమెరికాతో కలిసి ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపట్టే అవకాశాన్ని కొట్టిపారేయలేమని నిపుణులు చెప్తున్నారు.