కారకాస్, జనవరి 11 : ఈ నెల మొదటి వారంలో వెనెజువెలా దేశంపై అమెరికా జరిపిన దాడుల్లో అత్యంత శక్తివంతమైన, మునుపెన్నడూ ప్రయోగించని, చూడని ఆయుధాన్ని ప్రయోగించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షి కథనం ఈ ఆరోపణలను బలపరుస్తున్నది. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే క్రమంలో అమెరికా సోనిక్ (శబ్ద శక్తి) ఆయుధాన్ని ప్రయోగించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆ రోజు అమెరికా దాడి జరిపిన సమయంలో మదురో రక్షణ సిబ్బందిలోని ప్రత్యక్ష సాక్షి అయిన ఒక సైనికుడి కథనాన్ని న్యూయార్క్ పోస్ట్ ప్రచురించింది.
గార్డు చెప్పిన మాటలను వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కూడా పోస్ట్ చేశారు. ‘మేము గార్డు డ్యూటీలో ఉండగా సుమారు 8 వరకు హెలికాప్టర్లు, 20 మంది సైనికులతో మాత్రమే మాపై దాడి చేసి, అంతుచిక్కని ఒక డివైస్‌ను వారు వాడిన విషయాన్ని వెల్లడించాడు. ‘ఒక సమయంలో వారు ఏదో ఆయుధాన్ని ప్రయోగించారు. దానిని ఎలా వర్ణించాలో కూడా నాకు తెలియడం లేదు. బహుశా అది తీవ్ర శబ్ద తరంగం కావచ్చు. అది విన్న తర్వాత నా తల పేలిపోతుందేమో అన్పించింది. నా ముక్కు వెంట రక్తం కారడం ప్రారంభించింది. మిగిలిన వారిదీ అదే పరిస్థితి. మాలొ కొందరు రక్తపు వాంతులు చేసుకున్నారు. మేమంతా నేలపై పడిపోయాం. కదలలేక పోయాం.’ అని వివరించాడు.