US Elections | మిల్వాకీ, జూలై 16: అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్ష పదవికి తెలుగింటి అల్లుడు పోటీ పడనున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేమ్స్ డేవిడ్ వాన్స్(39) పేరు ఖరారయ్యింది. ఎన్నికల బరిలో తనతో పాటు పోరాడే సహచరుడిగా వాన్స్‌ను డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేసుకున్నారు. ప్రస్తుతం ఓహియో సెనేటర్‌గా జేడీ వాన్స్ ఉన్నారు. వాన్స్ సతీమణి ఉషా చిలుకూరికి భారతీయ మూలాలు ఉండటం విశేషం.
అమెరికాలో స్థిరపడిన ఏరోస్పేస్ ఇంజినీర్ రాధాకృష్ణ చిలుకూరి, ప్రొఫెసర్ లక్ష్మి చిలుకూరి కూతురు ఉషా. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో పుట్టి పెరిగిన ఉషా చిలుకూరి.. వృత్తిరీత్యా న్యాయవాది. ఆమె గతంలో అమెరికా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు క్లర్క్‌గా కూడా పని చేశారు. యేల్ లా స్కూల్లో ఉషా, వాన్స్ కలిసి న్యాయవిద్యను అభ్యసించారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడి వివాహానికి దారి తీసింది. 2014లో కెంటకీలో వీరి వివాహం హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో జరిగింది. వీరికి ఎవాన్(6), వివేక్(4), మీరాబెల్(2) పిల్లలు ఉన్నారు.
ఉపాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిగా వాన్స్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. వ్యాపారవేత్త అయిన వాన్స్ 2022లో ఓహియో నుంచి యూఎస్ సెనేట్‌కు ఎంపికయ్యారు. ఆయన రాసిన ‘హిల్బిన్నీ ఎలెగీ’ అనే పుస్తకం విశేషాదరణ పొందింది. ఈ పుస్తకం ఆధారంగా ఒక సినిమా కూడా తెరకెక్కింది. అనేక ఆలోచనలు, సంప్రదింపుల తర్వాత అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టేందుకు వాన్స్ సరైన వ్యక్తి అని తాను భావించినట్టు ట్రంప్ ప్రకటించారు. అయితే, గతంలో ట్రంప్‌ను వాన్స్ తీవ్రంగా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి ట్రంప్‌ను ‘అమెరికా హిట్లర్’ అని సైతం వాన్స్ విమర్శించారు. తర్వాతి కాలంలో ట్రంప్‌కు వాన్స్ నమ్మకస్తుడిగా మారారు. కాగా, తాను ఈ స్థాయిలో ఉండటానికి తన భార్య ఉషా మద్దతు కూడా ప్రధాన కారణమని ఓ ఇంటర్వ్యూలో వాన్స్ పేర్కొన్నారు. తనకు మార్గదర్శిగా నిలిచిన శక్తివంతమైన మహిళా గళం ఆమెదని చెప్పారు.
న్యూయార్క్, జూలై 16: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌నకు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ బలమైన మద్దతుదారుగా నిలుస్తున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే వెల్లడించిన మస్క్.. ఇప్పుడు ట్రంప్ కోసం భారీ విరాళం ఇవ్వాలని నిర్ణయించినట్టు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనం ప్రచురించింది. ట్రంప్ కోసం పని చేస్తున్న ‘అమెరికా పీఏసీ’ అనే సంస్థకు మస్క్ నెలకు 45 మిలియన్ డాలర్ల(రూ.376 కోట్లు) విరాళం ఇవ్వనున్నట్టు ఈ కథనం పేర్కొన్నది.
అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు ట్రంప్ పేరు అధికారికంగా ఖరారైంది. మిల్వాకీలో జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ జాతీయ సమావేశంలో పార్టీ ప్రతినిధులు ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపారు. దీంతో నవంబరులో జరగనున్న అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మరోసారి బరిలో నిలవడం ఖాయమైంది. రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ మూడోసారి అధ్యక్ష బరిలో నిలుస్తున్నారు. ఆయన 2016లో మొదటిసారి అధ్యక్ష బరిలో నిలిచి విజయం సాధించారు. 2020లో ఆయన మరోసారి పోటీ చేసి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓటమి చవిచూశారు. ఇప్పుడు మరోసారి ట్రంప్ అధ్యక్ష రేసులో నిలిచారు. ‘మేక్ అమెరికా గ్రేట్ వన్స్ అగైన్(అమెరికాను మరోసారి గొప్పగా మార్చండి)’ అనే నినాదంతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. తాజాగా ట్రంప్‌పై హత్యాయత్నం ఘటన నేపథ్యంలో అమెరికా ప్రజల్లో ఆయన మీద సానుభూతి నెలకొన్నది.