మాంట్రియల్ : కొందరు శక్తిమంతులు మనుషులను ఏఐ ద్వారా భర్తీ చేయాలని కోరుకుంటున్నారని కెనడా కంప్యూటర్ శాస్త్రవేత్త, ‘ఏఐ పితామహుడి’గా గుర్తింపు పొందిన యోషువా బెంగియో పేర్కొన్నారు. టెక్ దిగ్గజాలను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐతో పొంచి ఉన్న ప్రమాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జ్ఞానం శక్తిని ఇస్తుంది. ఆ శక్తిని దుర్వినియోగం చేయాలనుకునే వారు ఉన్నారు.
మనుషులను యంత్రాలు భర్తీ చేయడాన్ని చూసి ఆనందించే వారూ ఉన్నారు.’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యక్తులు గుప్పెడు మందే ఉన్నప్పటికీ, వారు శక్తిమంతులని అన్నారు. వెంటనే సరైన పరిమితులను విధించకపోతే వారు ఈ పనిని చేయగలరని హెచ్చరించారు. ఏఐ రంగంలో పెరుగుతున్న శక్తిని అదుపు చేయడానికి ప్రపంచ నాయకులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని, దీనిపై అంతర్జాతీయ విధానం తీసుకు రావాలని అన్నారు. మానవ మేధస్సు స్థాయిని ఏఐ ఎప్పుడూ సాధిస్తుందో ఎవరూ చెప్పలేరని ఆయన అన్నారు.