థర్మోరేడియేటివ్ డయోడ్ సాయంతో ఉత్పత్తి
సిడ్నీ, మే 19: సౌర విద్యుత్తు.. సూర్యుడి వెలుతురు నుంచి తయారుచేసేది. కానీ, రాత్రి పూట కూడా సౌర విద్యుత్తును తయారు చేస్తే..! అదెలా సాధ్యం అని అనుకొంటున్నారా? అద్భుత సాంకేతికతను అభివృద్ధి చేసి రాత్రి పూట కరెంటును ఉత్పత్తి చేసి చూపించారు ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు. యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ పరిశోధకులు థర్మోరేడియేటివ్ డయోడ్ అనే పరికరం ద్వారా ఇన్ఫ్రారెడ్ లైట్‌గా ప్రసరించే వేడి నుంచి విద్యుత్తును ఉత్పత్తి చేశారు.
వివరంగా చెప్పాలంటే.. పగటి పూట భూమిని సోలార్ రేడియేషన్ వేడెక్కిస్తుంది. రాత్రి సమయంలో అదే శక్తిని భూమి ఇన్ఫ్రారెడ్ లైట్ రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తుంది. ఆ ఇన్ఫ్రారెడ్ లైట్‌ను శాస్త్రవేత్తలు థర్మోరేడియేటివ్ డయోడ్ పరికరం సహాయంతో విద్యుత్తుగా మార్చారు. ఆ సమయంలో ఉత్పత్తి అయ్యే సోలార్ శక్తి.. సోలార్ ప్యానెల్ ద్వారా సరఫరా చేసేదానికంటే 1,00,000 రెట్లు తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో దాని సామర్థ్యాన్ని పెంచవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విద్యుత్తును బ్యాటరీల ద్వారా పరికరాల్లో ఉపయోగించవచ్చని వివరించారు. తాము అభివృద్ధి చేసిన సాంకేతికత బ్యాటరీలు రీచార్జ్ చేయటంలో దోహదపడుతుందని తెలిపారు. అంతేకాదు.. మనిషి నుంచి విడుదలయ్యే వేడి నుంచి కూడా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని వెల్లడించారు.
రిసెర్చ్ బృందం ఇన్ఫ్రారెడ్ చిత్రం ఇది. ఎరుపు రంగులో ఉన్నది మనిషి నుంచి విడుదలయ్యే వేడి. ఆ వేడితోనూ విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పరిశోధకులు తెలిపారు.